ఏంట్రా ఈ హింస అనుకున్నాను! | Hero Sampoornesh Babu Exclusive Interview | Sakshi
Sakshi News home page

ఏంట్రా ఈ హింస అనుకున్నాను!

Published Thu, Aug 8 2019 2:50 AM | Last Updated on Thu, Aug 8 2019 2:50 AM

Hero Sampoornesh Babu Exclusive Interview - Sakshi

సంపూర్ణేష్‌ బాబు

‘‘కొబ్బరిమట్ట’ సినిమా రిలీజ్‌ విషయంలో చాలా ఆందోళనకు గురయ్యాను. చాలామంది అసలు ఈ సినిమా విడుదల అవుతుందా? అన్నారు. చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు వాళ్లే ఫోన్‌ చేసి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాలని చూస్తున్నారు. నేను వాళ్ల ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదు’’ అన్నారు సంపూర్ణేష్‌బాబు. రూపర్‌ రోనాల్డ్‌ దర్శకత్వంలో సంపూర్ణేష్‌ హీరోగా సాయి రాజేష్‌ (స్టీవెన్‌ శంకర్‌) నిర్మించిన  ‘కొబ్బరిమట్ట’ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంపూర్ణేష్‌ పంచుకున్న విశేషాలు.


► మాది మిట్టపల్లి. మా నాన్నగారు గోల్డ్‌స్మిత్‌ వ్యాపారి. నాకు చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి. నాటకాల్లో నటించాను. వెండితెరపై నన్ను నేను చూసుకోవాలనుకుంటున్న సమయంలో ‘హృదయ కాలేయం’ దర్శకుడు స్టీవెన్‌ శంకర్‌ పరిచయం అయ్యాడు. ‘నేనొక చెత్త హీరో కోసం వెతుకుతున్నా’ అన్నాడు. అలా నరసింహాచారి హీరో సంపూర్ణేష్‌ బాబుగా మారాడు. ఆ తర్వాత ‘సింగం 123, వైరస్‌’ సినిమాలు చేశా. ‘హృదయ కాలేయం’ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు బాధించాయి.
 

► ‘కొబ్బరిమట్ట’ చిత్రంలో పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్‌ అనే మూడు పాత్రల్లో నటించాను. ఈ సినిమాలో నాకు ఆరుగురు భార్యలు, ముగ్గురు చెల్లెళ్లు ఉంటారు.

► ‘హృదయ కాలేయం’ తర్వాత ‘కొబ్బరిమట్ట’ పోస్టర్‌ రిలీజ్‌ చేశాం. ఈ సినిమా బాగా ఆలస్యం కావడానికి కారణం మేం అనుకున్న బడ్జెట్‌ కన్నా ఎక్కువ కావడమే. మధ్యలో నేను బిగ్‌బాస్‌ షోకు వెళ్లాల్సి రావడం ఒక కారణం. చాలామంది ఆర్టిస్టులు నటించడం వల్ల వారి కాంబినేషన్‌ సీన్స్‌ తీయడానికి కష్టపడ్డాం. ఈ సినిమా జర్నీ మూడేళ్ల పాటు సాగింది. నా మొదటి సినిమా దర్శకుడు స్టీవెన్‌ ఈ సినిమా నిర్మించినందుకు ఆయనకు థ్యాంక్స్‌.

► ఈ సినిమాలో నేను మూడున్నర నిమిషాల డైలాగ్స్‌ చెప్పడం కోసం చాలా కష్టపడ్డాను. చదువుకోవడానికే రెండు రోజులు పట్టింది. రాయడం, వినడం, చదవడం ఇలా చాలా ప్రాక్టీస్‌ చేసి చెప్పాను. మంచి స్పందన లభించింది. డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబుగారు ఫోన్‌ చేసి అభినందించడం హ్యాపీ. అయితే ఈ డైలాగ్‌ ఫస్ట్‌ టైమ్‌ నా దగ్గరకు వచ్చినప్పుడు ‘ఏంట్రా ఈ హింస’ అనుకున్నా.

► నేను హైదరాబాద్‌కు ఇంకా షిఫ్ట్‌ కాలేదు. నాకు ఇద్దరు కుమార్తెలు. మా ఊర్లోనే ఉందామని మా ఆవిడ చెప్పారు. అయితే నరసింహాచారి కన్నా సంపూర్ణేష్‌ బాబు లైఫ్‌ బాగుందని చెప్పగలను. సంపూర్ణేష్‌ బాబుగా నాకు వచ్చిన క్రేజ్‌నే వినియోగించుకోలేకపోతున్నాను. ఇక బర్నింగ్‌స్టార్‌ అనే ట్యాగ్‌ను నేనేం చేసుకోను.

► ఇటీవల రెండు సినిమాలకు అడ్వాన్స్‌ తీసుకున్నాను. కానీ ‘కొబ్బరి మట్ట’ విడుదలపై క్లారిటీ లేకపోవడంతో ఆ సినిమాలు ఆగిపోయే పరిస్థితి. ఈ సినిమాపై నా కెరీర్‌ ఆధారపడి ఉంది.


సన్నీ లియోన్‌ తెలియదు
మనోజ్‌ ‘కరెంట్‌తీగ’ సినిమాలో సన్నీ లియోన్‌తో నటించబోతున్నానగానే అందరూ అవాక్కయ్యారు. అప్పటివరకూ సన్నీ లియోన్‌ ఎవరో నాకు తెలియదు. సెట్‌లో ఆమెను చూశాను. నన్ను మనోజ్‌ ఆమెకు పరిచయం చేశారు. మేం పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. నాకు ఇంగ్లీష్‌ రాదు.. సన్నీకి తెలుగు రాదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement