ఆహార పొట్లాలు అందజేస్తున్న సినీ హీరో వేణు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ హీరో వేణు, కాకతీయ ఇన్ ఫ్రా ఎండీ సీబీఐ వాసు తమ మిత్రబృందంతో కలిసి ప్రతీ రోజు 500 మంది పేదల ఆకలి తీరుస్తున్నారు. కాకతీయ ఇన్ ఫ్రా, వాసు గ్రూప్ ఆధ్యర్యంలో ఏర్పడిన మిత్ర బృందం నగరంలోని మాదాపూర్, గచ్చిబౌళి, కొండాపూర్ ప్రాంతాల్లో ప్రతిరోజు ఆహారం అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాంబార్ రైస్, పెరుగన్నం, కోడిగుడ్డు, వాటర్ బాటిల్‌తో కూడిన పొట్లాలను స్వయంగా అందిస్తున్నారు. కేవలం పేదలకే కాకుండా పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, ఇతర అత్యవసర సేవలు అందిస్తున్న వారికి కూడా ఆహార పొట్లాలు, మంచినీళ్లు, మజ్జిగ ఉచితంగా సరఫరా చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం కూడా చేరుకోలేని చోటుకి సహాయం అందాల్సిన అవసరం ఉందని వేణు అభిప్రాయపడ్డారు. అలాగే దినసరి కూలీలు, ఆటో డ్రైవర్లు, హమాలీలు, షాపులు, హోటల్లో పనిచేసే వారు, తోపుడుబండ్లు నిర్వహించే వారు ఇబ్బంది పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన సామాజిక బాధ్యత అందరిపై ఉందని కాకతీయ ఇన్ఫ్రా ఎండీ వాసు అన్నారు.
బంజారాహిల్స్ పోలీసులకు శానిటైజర్లు అందిస్తున్న సినీ హీరో శ్రీకాంత్
పోలీసుల సేవలు విలువైనవి
ఇంతటి కఠిన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు ఎంతో విలువైనవని సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు ఆయన శానిటైజర్లు, మాస్క్‌లు అందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పోలీసుల సేవలకు తన వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఏసీపీ కే.ఎస్.రావు, బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కళింగరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment