రెమోకు పన్ను మినహాయింపా?
ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
పెరంబూర్: రెమో చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపును వర్తింపజేయడంపై వివరణ ఇవ్వాల్సిందిగా మద్రాసు హైకోర్టు ప్రభుత్వ ఆదాయ పన్ను శాఖకు నోటీసులు జారీ చేసింది. శివకార్తికేయన్, కీర్తీసురేశ్ జంటగా నటించిన చిత్రం రెమో. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రంపై స్థానిక చూలెమైడుకు చెందిన వరదరాజన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అందులో ఆయన పేర్కొంటూ తాను ఈ నెల ఏడో తేదీన రెమో చిత్రం చూడడానికి నగరంలోని ఒక సినిమా థియేటర్‌కు వెళ్లానన్నారు.రూ 120 ధర చెల్లించి టికెట్ కొన్నానన్నారు.అప్పుడే రెమో చిత్రానికి ప్రభుత్వం పన్ను మినహాయింపును వర్తింపజేసిందని తనకు తెలిసిందన్నారు.
తమిళ భాషను, తమిళ సినిమాను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం 2005లో పలు రాయితీలను ప్రకటించిందన్నారు. అప్పటి నుంచి తమిళంలో పేర్లు కలిగిన చిత్రాలకు వినోదపు పన్నును మినహాయిస్తూ వస్తోందన్నారు.కాగా శివకార్తీకేయన్ నటించిన చిత్రం రెమో తమిళ భాషకు చెందిన టైటిల్ కాదన్నారు. అది లాఠిన్ భాషకు చెందిన పదం అని పేర్కొన్నారు. తమిళ ప్రభుత్వ ఆదాయ పన్ను శాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నిర్వహిస్తున్న చంద్రమౌళినే అదే శాఖలో అదనపు ప్రధాన కార్యద ర్శిగానూ వ్యవహరిస్తున్నారని, రెమో అన్న పేరు తమిళ భాషకు చెందింది కాదని తెలిసినా ఆ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపును వర్తింపజేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రజల నుంచి వసూలు చేస్తున్న ధనాన్ని ప్రభుత్వానికి చేరకుండా చిత్ర నిర్మాతకు లబ్ధిచేకూర్చుతున్నారన్నారు. రెమో చిత్రానికి వర్తింపజేసిన వినోదపు పన్నును రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు శనివారం న్యాయమూర్తి శివజ్ఞానం సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ కేసు విషయంలో ప్రభుత్వ ఆదాయ శాఖ ప్రధాన కార్యదర్శి బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసి మరు విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేశారు.