
అజిత్‌కు జంటగా రితికాసింగ్?
అజిత్‌కు జంటగా రితికాసింగ్ నటించనుందా? అన్న ప్రశ్నకు అలాంటి అవకాశం ఉందనే సమాధానం కోలీవుడ్ నుంచి వస్తోంది. తొలి చిత్రం ఇరుదుచుట్రు చిత్రంతోనే దక్షిణాది చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపు తిప్పుకున్న ముంబై బ్యూటీ రితికాసింగ్. రియల్ బాక్సర్ అయిన ఈ భామ ఇరుదుచుట్రు చిత్రంలోనూ అలాంటి పాత్రనే పోషించి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం తరువాత రితికకు పలు అవకాశాలు తలుపు తడుతున్నాయి.
ఇరుదుచుట్రు తెలుగు రీమోక్‌లోనూ నాయకి అవకాశం ఈ అమ్మడినే వరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో కుట్రమే దండణై చిత్రంలో నటిస్తోంది. తాజాగా అల్టిమేట్ స్టార్ అజిత్‌తో రొమాన్స్ చేసే అవకాశం తలుపుతట్టినట్లు సమాచారం. వేదాళం చిత్రం తరువాత అజిత్ తన 57వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఆయనతో వీరం, వేదాళం చిత్రాలను తెరకెక్కించిన టి.శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారన్న విషయం తెలిసిందే. సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి.త్యాగరాజన్ నిర్మించనున్న ఈ భారీ చిత్రం జూలైలో సెట్‌పైకి వెళ్లనుంది.
ఇందులో అజిత్ సరసన నటి అనుష్క నాయకిగా ఎంపికయ్యారన్న ప్రచారం ఇప్పటికే హల్‌చల్ చేస్తోంది.అయితే ఇందులో మరో నాయకి కూడా ఉంటుందట. ఆ పాత్ర కోసం ఇరుదుచుట్రు హీరోయిన్ రితికాసింగ్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందించనున్నారన్న విషయం తెలిసిందే.ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.