
‘మాయాబజార్’ చిత్రంలో దృశ్యం
కరోనా వార్తలు బెంబేలెత్తించవచ్చు. జనతా కర్ఫ్యూ మనం ఇంట్లోనే ఉండవలసిన బాధ్యతను గుర్తు చేయవచ్చు. ఇదీ ఒకందుకు మంచిదే. ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొంచెం బ్రేక్ దొరికినట్టవుతుంది. ఇలాంటి టైములో స్ట్రెస్‌ను పక్కన పెట్టండి. హాయిగా కుటుంబంతో కామెడీ సినిమాలు చూడండి. కామెడీ సీన్లు ప్లే చేసి హాయిగా నవ్వుకోండి. ‘కరోనా’కు రోగ నిరోధక శక్తిని చూస్తే భయం. హాస్యం అత్యంత పెద్ద రోగనిరోధక శక్తి. గొప్ప హెల్త్ టానిక్.
‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదోయ్’ అంటాడు శకుని ‘మాయాబజార్’లో శర్మ, శాస్త్రిలను ఉద్దేశించి. వారు చేసిన బుద్ధిమాలిన పని ఏమిటి? యాదవుల విడిదికి వచ్చి, మగపెళ్లివారమన్న సంగతిని మరచి, సాక్షాత్తు సుయోధనుని ముందే ఆడపెళ్లివాళ్లను పొగడటం... వాళ్ల ఏర్పాట్లను చూసి నోరు వెళ్లబెట్టడం. పండితులంటే గొప్పవారని మన ఉద్దేశం. కాని పాండిత్యం వేరు, బుద్ధి వేరు అని ఈ సినిమాలో నవ్వు వచ్చేలా నీతి చెబుతాడు దర్శకుడు కె.వి.రెడ్డి. కొంచెం స్ట్రెస్ వదిలించుకోవడానికి ఆ సినిమాయో సీనో చూసేయండి. బాగుంటుంది.
‘జస్టిస్... జస్టిస్... ఐ వాంట్ సింపుల్ జస్టిస్’ అంటుంటాడు రమణారెడ్డి ‘మిస్సమ్మ’ సినిమాలో. సావిత్రి మీద కన్నేసిన ఈ మాయలమరాఠి ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఇచ్చిన అప్పును అడ్డం పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు. అతడో పెద్ద ఫోర్‌ట్వంటి. కానీ నోరు తెరిస్తే ‘జస్టిస్’ అని న్యాయం మాట్లాడుతుంటాడు. లోకంలో నిండా ఉన్నది ఇలాంటి మనుషులే అని రచయిత చక్రపాణి, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ నవ్విస్తూ చూపుతారు ‘మిస్సమ్మ’లో. చూడండి బాగుంటుంది.
‘బ్రేకులా... మనం ఈ కారు కొన్నప్పటి నుంచి వాటి కోసమే వెతుకుతున్నాం... దొరకలేదు’ అంటాడు అక్కినేని సరాసరి తన డొక్కు కారుతో కాంచన, రాజశ్రీల కారును డాష్ కొట్టి. ‘ప్రేమించి చూడు’లో రెండు జంటలు, నాలుగు నవ్వులు ఉంటాయి. ‘నీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద... సాయము వలదా’ వంటి రసగుల్లాలు, ‘అందాలు తొంగి చూసే హా..హా..హా..’ వంటి పాల తాలికలు ఉంటాయి. ఈ సినిమాలోనే సినిమా పిచ్చోడు చలం వాళ్ల నాన్న రేలంగికి వల్లకాడు కథ చెప్పి భయపెడుతుంటాడు. రావికొండల రావు ‘తెలుగు మాష్టారు’ హాస్యం ఉంటుంది. సరదా సినిమా. ఇది ఖాళీ సమయం. చూసేయండి.
భానుమతిని చాలా సినిమాల్లో ఇష్టంగా చూడొచ్చుగాని ‘మట్టిలో మాణిక్యం’లో ఇంకా ఇష్టంగా చూడొచ్చు. ఆమె వ్యంగ్యం అంతా ఆ సినిమాలో ఉంటుంది. మరిది చలంను కన్నబిడ్డలాగా కాపాడుకోవడంలో ఆమె చూపించే ఆరిందాతనం ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. ఎంతో అమాయకంగా ఉండే చలం నటన, అతని స్నేహితుడిగా పద్మనాభం హాస్యం సినిమాను పరుగులెత్తిస్తాయి. జమున ఒక జాంపండులా ఉంటుంది. ‘నా మాటే నీ మాటై చదవాలి’ అని పాట కూడా పాడుతుంది. ఇంట్లోనే ఉండి హైదరాబాద్ చుట్టేయాలంటే ఈ సినిమా చూడొచ్చు. ‘రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్’ పాడేయొచ్చు.
రేడియో ప్రోగ్రామ్ వింటూ వంకాయ కూర చేద్దామనుకుంటాడు సీతాపతి. కానీ పక్క స్టేషన్‌లో యోగా క్లాస్ కూడా వస్తుంటుంది. రెండు స్టేషన్‌లూ జామ్ అవుతుంటాయి. దాంతో యోగా చేస్తూ వంకాయ కూర చేస్తూ నవ్విస్తాడు మనల్ని. ‘సీతాపతి సంసారం’ సినిమా మధ్యతరగతి గుమాస్తా బతుకులో భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు ఉన్న కంప్లయింట్‌లను లైటర్ వెయిన్‌లో చూపిస్తుంది. సంసారం పెద్ద కష్టం కాదు అని భార్య రోల్‌లోకి వచ్చిన సీతాపతి చాలా కామెడీ చేస్తాడు. చంద్రమోహన్, ప్రభ నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు ఇంట్లో భార్య, భర్త తీరుబడిగా ఉండే సమయం. చాలా కంప్లయింట్‌లు చేసుకునే మూడ్ కూడా వస్తుంది. ఆ మూడ్ వద్దు. అడ్జ్‌స్ట్ అవుతూ బతకడమే ముద్దు అని ‘సీతాపతి సంసారం’ చూసేయండి.
అతనికి ఆరుగురు పిల్లలు. ఆమెకు అరడజను సంతానం. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి. అతని పిల్లలు రౌడీ మూక. ఆమె పిల్లలు కిష్కింధ ఇలాక. ఈ పన్నెండు మంది కలిస్తే ఆ పెళ్లి ఎంత అల్లరిగిల్లరిగా, ఆ కాపురం ఎంత నవ్వులుపువ్వులుగా ఉంటుందో చెప్ప లేం. ‘రామదండు’ సినిమా ఇది. మురళీమోహన్, సరిత నటించారు. కె.బాలచందర్ దర్శకత్వ పర్యవేక్షణ వహించారు. ‘బండి కాదు మొండి ఇది సాయం పట్టండి’ పాట ఇందులోదే. ఇంట్లో పిల్లలు ఇప్పుడేం చేయాలో తెలియక కోతి పనులు చేస్తుంటారు. వారికి ఈ కోతి సినిమా చూపించండి. బుద్ధిగుంటారు. భలే నవ్వుకుంటారు.
ఇక జంధ్యాల, రేలంగి నరసింహారావు, వంశీ, ఇ.వి.వి. సత్యనారాయణ, పి.ఎన్.రామచంద్రరావు, శివ నాగేశ్వరరావు, భీమనేని శ్రీనివాసరావు, విజయ భాస్కర్... వీరంతా తీసిన సినిమాలు తెలుగులో ఎన్నో స్ట్రెస్ బస్టర్స్‌గా ఉన్నాయి. ఎన్నో పాత్రలు నవ్వించి మనల్ని కాసేపు టెన్షన్స్ మర్చిపోయేలా చేస్తాయి. ‘శ్రీవారికి ప్రేమలేఖ’లో కోపం వస్తే తల గోడలకేసి బాది క్రాకులు సృష్టించే సుత్తి వీరభద్రరావు, ‘ఆనందభైరవి’లో నవ్వొచ్చినా ఏడుపొచ్చినా కయ్యిన విజిల్ వేసే శ్రీలక్ష్మి, ‘ఎదురింటి మొగుడు–పక్కింటి పెళ్లాం’లో స్టాంపు అంటించడానికి కూడా సొంత ఉమ్మును వాడటానికి వెనుకాడే పిసినారి రాజేంద్రప్రసాద్, వాళ్లకూ వీళ్లకూ ఠస్సా ఇచ్చి వీడియోలైబ్రరీ పెట్టే ‘ఏప్రిల్ 1 విడుదల’ దివాకరం, ‘ఆ ఒక్కటీ అడక్కు’లో రొయ్యల నాయుడు రావు గోపాలరావు, అద్దె ఇంటి కోసం ఆడవేషం కట్టే ‘చిత్రం భళారే విచిత్రం’ నరేష్, ‘మనీ’లో ఖాన్‌దాదా, ‘శుభాకాంక్షలు’లో ‘చరణకింకిణులు గొల్లుగొల్లుమన’ పాడే గాయకుడు ఏ.వి.ఎస్, ‘నువ్వు నాకు నచ్చావ్’లో తల్లి మీద కవిత్వం చెప్పే ఎమోషనల్ కొడుకు ప్రకాష్ రాజ్... వీరంతా ఈ కరోనా కాలంలో కాసింత దృష్టి మళ్లించే ఔషధాలు... మందులు. కనుక స్ట్రెస్ మానండి. సినిమా చూడండి.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment