కంగనాపై టాప్ హీరోయిన్ ప్రశంసలు
ముంబై: హృతిక్ రోషన్‌తో ఎఫైర్ వివాదంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్‌కు విద్యాబాలన్ మద్దతు పలికింది. కంగనా స్వయంశక్తితో పైకొచ్చి తన కాళ్లపై తాను నిలబడిందని ప్రశంసించింది. విద్యా బాలన్ తాజా సినిమా 'తీన్' టీజర్ లాంచ్ సందర్భంగా హృతిక్-కంగనా వివాదంపై ఆమెను విలేకరులు ప్రశ్నించారు. 'అది నాకు సంబంధించిన విషయం కాదు. నేనెవరినీ జడ్జ్ చేయలేను. కానీ స్వయంశక్తితో పైకొచ్చిన కంగనా అంటే నాకు ఎంతో గౌరవభావం ఉంది' అని విద్య పేర్కొంది.
'మహిళలుగా మేం ఇతరులు పైకొస్తున్నప్పుడు వారికి అండగా ఉంటాం. కుటుంబసభ్యులు, పిల్లలు, భర్త, తల్లిదండ్రులు ఎదుగుతున్నప్పుడు మహిళలు వారికి అండగా ఉంటారు. కానీ మా కోసం మేం అరుదుగా నిలబడతాం. తను (కంగన) కూడా తన కాళ్లపై తాను నిలబడి పైకొచ్చింది. అందుకు ఆమెకు నా జోహార్లు అర్పిస్తున్నాం. ఆమెకు మరింత శక్తి చేకూరాలని కోరుకుంటున్నా' అని విద్యా బాలన్ పేర్కొంది.