'నా పేరు చూసి నవ్వాల్సిన పనిలేదు'
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తన పేరును ఎగతాళి చేయడంపై బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్ స్పందించాడు. తన పేరు చూసి నవ్వాల్సిన పనిలేదని, అది తనకెంతో గర్వకారణమని చెప్పాడు. దిగ్గజ గాయకుడు ముకేశ్ కుటుంబంలో పుట్టడం దీవెనగా భావిస్తున్నామని అన్నాడు. 'నా పేరు చూసి చాలా మంది నవ్వుతున్నారు. కానీ నేను గర్వపడుతున్నాను. ఈ రోజుల్లో తండ్రుల పేర్లను ఎంత మంది పెట్టుకుంటున్నారు. వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నార'ని ప్రశ్నించాడు.
నీల్.. ప్రముఖ గాయకుడు నితిన్ ముకేశ్ కుమారుడు, దిగ్గజ గాయకుడు ముకేశ్ కుమార్ మనవడు. తన తండ్రి, తాత పేరు నిలపాల్సిన బాధ్యత తన భుజాలపై ఉందని నీల్ అన్నాడు. ఏనుగులపై సవారీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు 'పెటా'తో అతడు చేతులు కలిపాడు.