‘‘విజయ్ ఆంటోని సినిమాలు చూడలేదు కానీ, ఆయన నటించిన ‘పిచ్చైకారన్’ను తెలుగులో రీమేక్ చేయాలను కుంటుండగానే ‘బిచ్చగాడు’ పేరుతో అనువాదమై, హిట్ అయింది. అప్పుడు ‘మంచి సినిమా వదులుకున్నామే’ అనుకున్నా’’ అని హీరో రాజశేఖర్ అన్నారు. విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్ మేరీ ప్రధాన పాత్రల్లో జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంద్రసేన’. ఈ చిత్రాన్ని తెలుగులో నీలం కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు.
విజయ్ ఆంటోని స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రాజశేఖర్, జీవిత రిలీజ్ చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘నేను మిస్ చేసుకున్న ‘బిచ్చగాడు’ సినిమా చూస్తే ఇంకా బాధపడతానని చూడలేదు. ఆ సినిమాలో అమ్మ పాట నాకు ఎంతో నచ్చుతుంది. దాని కోసమైనా సినిమా చూస్తా. ‘ఇంద్రసేన’ మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు. నటి–నిర్మాత రాధిక మాట్లాడుతూ– ‘‘మంచి సినిమా లను ఆదరించే ప్రేక్షకుల్లో మొదటి స్థానం తెలుగు వారిదే.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మంచి సినిమాలను ఆదరిస్తారు. నన్ను ఆదరిస్తున్న తెలుగువారికి రుణపడి ఉంటా. ఈ కథ విని, శరత్‌కుమార్‌గారు ఏడ్చారు. నేను అడగ్గానే సినిమా చేయడానికి ఓకే అన్నారు విజయ్ ఆంటోని. ‘ఇంద్రసేన’ తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘నేనీ రోజు ఇక్కడ నిలబడటానికి కారణం విజయ్ ఆంటోనిగారు. ఈ అవకాశాన్నిచ్చిన రాధిక, ఫాతిమా ఆంటోనిలకు థ్యాంక్స్’’ అన్నారు జి. శ్రీనివాసన్.
‘‘పదిహేనేళ్ల క్రితం రాధికగారు నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశారు. ఇప్పుడు నటించే అవకాశం ఇచ్చినందుకు రాధిక, శరత్‌కుమార్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు విజయ్ ఆంటోని. నటి జీవిత, చిత్రనిర్మాత నీలం కృష్ణారెడ్డి, ‘బిచ్చగాడు’ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, రచయిత భాష్యశ్రీ, సినిమాటోగ్రాఫర్ దిల్రాజ్, నిర్మాత సురేశ్ కొండేటి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment