హింస ఎక్కువేమీ లేదు! | It is action, not violence: boyapati srinu | Sakshi
Sakshi News home page

హింస ఎక్కువేమీ లేదు!

Published Wed, Apr 2 2014 3:15 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

హింస ఎక్కువేమీ లేదు! - Sakshi

హింస ఎక్కువేమీ లేదు!

‘‘ ‘సింహా’ విజయం సాధించాక, బాలయ్యబాబుతో కలిసి దైవ దర్శనార్థం సింహాచలం వెళ్లాను. అక్కడ మమ్మల్ని చూడటానికి వేలాదిగా జనం వచ్చారు. ఆ జనసందోహం సాక్షిగా ‘నేను కోరిన సమయంలో... నాకో మంచి సినిమా చేసిపెట్టాలి’ అని బాలయ్య నన్నో కోరిక కోరారు. ‘కచ్చితంగా చేస్తాను సార్’ అని మాటిచ్చాను. అదే ‘లెజెండ్’’’ అని బోయ పాటి శ్రీను చెప్పారు. బాలకృష్ణ కథానాయకునిగా బోయపాటి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి నిర్మించిన ‘లెజెండ్’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా బోయపాటి విలేకరులతో ముచ్చటించారు. ‘‘122 రోజులు మేం పడిన కష్టానికి తగిన ఫలితం రావడం ఆనందంగా ఉంది. కొత్త బాలకృష్ణను చూపించానని అందరూ అంటున్నారు’’ అని బోయపాటి ఆనందం వెలిబుచ్చారు.
 
  సినిమాలో హింస ఎక్కువైందనడం సబబు కాదని, తన వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు కథానాయకుడు ఆ మాత్రం ఉద్వేగానికి లోనవడం సబబేననీ అన్నారు. ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీ మీద ఈ సినిమాలో విమర్శలు ఎక్కుపెట్టలేదనీ, సామాజికాంశాలను మాత్రమే స్పృశించామనీ బోయపాటి చెప్పారు. ‘‘దర్శకులు కె.రాఘవేంద్రరావు, రామ్‌గోపాల్‌వర్మ ఫోన్లు చేసి అభినందించారు. విదేశాల్లో సైతం ‘లెజెండ్’ విజయఢంకా మోగించడం ఆనందంగా ఉంది’’ అని సంతోషం వెలిబుచ్చారు బోయపాటి. తరువాతి సినిమా చరణ్‌తో... ‘‘ ‘లెజెండ్’ సింహ యాత్ర అనంతరం రామ్‌చరణ్ సినిమాపై దృష్టి సారిస్తా. ఇప్పటికే చిరంజీవిగారికి, చరణ్‌కి కథ చెప్పడం కూడా జరిగింది. వాళ్లకు కథ నచ్చింది. తుదిమెరుగులు దిద్దాలి. దానికి రెండు, మూడు నెలలు పడుతుంది. కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు’’ అని ఆయన వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement