అమ్మ మాట జవదాటను
అమ్మ మాట జవదాటను చాలా మంది హీరోయిన్లు అమ్మ గారాల బిడ్డలే. వారి మాటలే వేదం. క్రేజీ నటి హన్సిక తల్లి చాటు కూతురే. అమ్మే ఆమెకు మార్గ దర్శకురాలు. బాలతారగా ప్రవేశించిన ఈ బబ్లీ గర్ల్ స్టేజీ కార్యక్రమాలు, మోడలింగ్, యాడ్స్ అంటూ తన నటనకు పదునుపెట్టుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కోలీవుడ్‌లో అత్యధిక చిత్రాలు చేస్తున్న హీరోయిన్ హన్సికే. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలో కాస్త వేడి పుట్టించినా ప్రస్తుతం బుద్దిగా నటనపైనే దృష్టి సారించింది.
ఈ భామ త్వరలో నటుడు విశాల్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది. అమ్మ మాట జవదాటని హన్సిక ఈ మధ్య నటుడు శింబుతో ప్రేమ వ్యహారంలో పడి తల్లి హితబోధను పెడచెవిన పెట్టి తప్పటడుగులు వేసే ప్రయత్నం చేసింది. ఆ విధంగా కాస్త సంచలనం కలిగించినా శింబు ప్రేమకు రాంరాం పలికి మళ్లీ అమ్మ గూటికే చేరింది. ఏ విషయమైనా అమ్మతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటోందట.
కథల ఎంపికలోనే కాకుండా ఏ హీరోతో జత కట్టాలి వంటి విషయాలను హన్సిక అమ్మే చూసుకుంటున్నారట. దీని గురించి ఈ క్రేజీ హీరోయిన్ తెలుపుతూ బాల తారగా నటిస్తున్నప్పటి నుంచే అమ్మ చెప్పినట్టే నడుచుకుంటున్నానని తెలిపింది. ఇప్పటికీ అదే అలవాటుగా మారిందని పేర్కొంది. ఇటీవల ఈ అమ్మడు ఒక సాహస కార్యం చేసింది.
చెన్నైలోని ఒక సినీ కాంప్లెక్స్‌కు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా వెళ్లి సినిమా చూసొచ్చింది. హన్సిక లాంటి స్టార్ సినిమా కొస్తే ప్రేక్షకుల కంట పడకుండా ఉండడం సాధ్యమా చాలా మంది ఆమెను గుమికూడి ఆటోగ్రాఫ్‌లు తమ సెల్‌ఫోన్‌లతో ఫొటోలు తీసుకోవడం కార్యక్రమాలతో ఆ ప్రాంతం కలకలంగా మారిపోయింది. అయినా అదంతా అధిగమించి హన్సిక సురక్షితంగా ఎవరి సాయం లేకుండా ఇల్లు చేరింది.