హా అంటారా... హడలిపోతారా! | Top Actress Ready to horror Movies | Sakshi
Sakshi News home page

హా అంటారా... హడలిపోతారా!

Published Tue, Nov 8 2022 4:36 AM | Last Updated on Tue, Nov 8 2022 3:22 PM

Top Actress Ready to horror Movies - Sakshi

అందాల తారలు భయపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆ అందం వెనక ఎంత ట్రాజెడీ ఉండి ఉంటే.. భయపెట్టాలనుకుని ఉంటారో ఊహించవచ్చు. అలా భయపెట్టే కథలతో కొందరు కథానాయికలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మరి ప్రేక్షకులు ‘హా’ అంటూ హడలిపోతారా చూడాలి. ఇక ఈ హారర్‌ స్టోరీలపై ఓ లుక్‌ వేయండి.  

‘మాయ’, ‘ఐరా’, ‘డోరా’... ఇలా వీలై నప్పుడల్లా వెండితెరపై ఆడియన్స్‌ని భయ పెట్టారు హీరోయిన్‌ నయనతార. తాజాగా  నయనతార గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన మరో హారర్‌ మూవీ ‘కనెక్ట్‌’. నయనతారతో 2015లో ‘మాయ’ సినిమా తీసిన అశ్విన్‌ శరవణన్‌యే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ కీ రోల్స్‌ చేస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.



మరోవైపు హారర్‌ జానర్‌పై హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కాజల్‌ డైరీలో మూడు హారర్‌ సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాజల్‌ ప్రధాన పాత్రధారిగా యోగిబాబు, దర్శక–నటుడు కేఎస్‌ రవి కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఘోస్టీ’. హారర్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నటించగా, కల్యాణ్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు.

అలాగే తమిళ దర్శకుడు డీకే దర్శకత్వంలో ‘కరుంగాప్పియమ్‌’ అనే హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలో ఓ లీడ్‌ రోల్‌ చేశారు కాజల్‌ అగర్వాల్‌. కాజల్‌తో పాటు ఈ సినిమాలో రెజీనా, జనని, నోయిరికా, రజియా విల్సన్‌ నటించారు. ఈ చిత్రంలో కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్న యువతి పాత్రలో కాజల్‌ కనిపిస్తారు.



ఇక హారర్‌ జానర్‌లో వచ్చిన చిత్రాల్లో ‘చంద్రముఖి’ సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రెడీ అవుతోంది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసుయే మలి భాగానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఫస్ట్‌ పార్ట్‌లో రజనీకాంత్‌ నటించగా, ‘చంద్రముఖి 2’లో రాఘవా లారెన్స్‌ మెయిన్‌ లీడ్‌ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఓ హీరోయిన్‌ పాత్రకు కాజల్‌ అగర్వాల్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్‌.



మరోవైపు వెండి తెరపై ఇప్పటివరకు గ్లామరస్‌గా కనిపించిన హన్సిక కూడా హారర్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ మధ్య ‘గార్డియన్‌’ అనే హారర్‌ ఫిల్మ్‌కు హన్సిక సైన్‌ చేశారు. ఆల్రెడీ ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజైంది. శబరి–గురుశరవణన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఆర్‌. కన్నన్‌ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న హారర్‌ సినిమాలో కూడా హన్సిక నటిస్తున్నారు.



మరో హీరోయిన్‌ రాయ్‌లక్ష్మీ ‘సిండ్రెల్లా’గా ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యారు. వినో వెంకటేశ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సాక్షీ అగర్వాల్‌ ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో రాయ్‌లక్ష్మీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా.. ‘రాజుగారి గది 2’ తర్వాత సమంత మరోసారి ప్రేతాత్మగా కనిపించనున్నారని, ఈ సినిమాకు ‘స్త్రీ’ ఫేమ్‌ అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే మరికొందరు కథానాయికలు సినిమాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement