ప్రేమిస్తా... ఓపిక పడతా.. భరిస్తా.. అవసరమైతే తాట తీస్తా! - పవన్‌కల్యాణ్
ప్రేమిస్తా... ఓపిక పడతా.. భరిస్తా.. అవసరమైతే తాట తీస్తా! - పవన్‌కల్యాణ్
Published Wed, Oct 16 2013 1:47 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
‘‘మా సినిమాకు జరిగింది పైరసీ కాదు... కుట్ర. కంచె చేను మేసినట్లుగా, అయినవారే నమ్మక ద్రోహం చేశారు. ఈ దుశ్చర్యకి పాల్పడినవారికి, అందుకు సహకరించిన వారికీ నేను చెప్పేది ఒక్కటే. ఎవ్వరినీ వదలను. శిక్షించి తీరతాను. సినిమా హిట్ అయ్యిందిలే... మరిచిపోతాడులే అనుకుంటే వాళ్లు పొరపడ్డట్టే. ప్రేమిస్తా... ఓపిక పడతా.. భరిస్తా.. అవసరమైతే తాట తీస్తా. ఎవ్వర్నీ వదిలేది లేదు’’ అని ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని యూట్యూబ్‌లో పెట్టి, పైరసీకి కారణం అయిన వారికి హెచ్చరిక జారీ చేశారు పవన్‌కల్యాణ్. దసరా రోజు రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘అత్తారింటికి దారేది’ ‘థ్యాంక్స్ మీట్’లో పవన్ భావోద్వేగంగా ప్రసంగించారు. పవన్ మాటల తూటాలు ఇంకా ఇలా పేలాయి.
*** మాది నిగ్రహం.. చేతకాని తనం కాదు
నిజంగా పైరసీకి పాల్పడాలనుకునేవారెవరూ 50 రోజుల పాటు గుప్పెట్లో సినిమాను పెట్టుకొని కూర్చోరు. ఈ దుర్మార్గానికి కారకులైన అసలు వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. పోలీసులు పట్టుకుంది పావుల్ని మాత్రమే. ఆటగాళ్లు వేరే ఉన్నారు. వాళ్లు కూడా త్వరలోనే బయటికొస్తారు. దేశభక్తి, సమాజంపై గౌరవం, ప్రస్తుత పరిస్థితులు మా నోరు జారనీయకుండా చేశాయి. ఇది నిగ్రహం తప్ప చేతకాని తనం కాదు. అన్ని రోజులూ మావే కావాలని, మా సినిమాలు మాత్రమే ఆడాలని కోరుకునే తక్కువస్థాయి మనుషులం కాదు మేం. అందరూ బాగుండాలని కోరుకుంటాం. కుదిరినంతవరకూ సర్దుకుపోతాం. లేదంటే ఊహించని రీతిలో తిరగబడతాం.
*** వారి రియాక్షన్ చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు
సినిమా యూట్యూబ్‌లోకి రాగానే.. బయట జనాలు, అభిమానులు పెద్దగా చూడలేదేమో కానీ.. పరిశ్రమ ప్రముఖులు మాత్రం చాలామంది చూసేశారు. ఎవరికైతే సినిమా జీవితాన్ని ఇచ్చిందో, ఎవరైతే ఇండస్ట్రీని నమ్ముకుని బతుకుతున్నారో వారే... తమ తమ ఐప్యాడ్స్‌లో, ల్యాప్ టాప్‌ల్లో సినిమాను చూసేసి.. ‘సినిమా బాగా వచ్చింది.. మీరేం భయపడకండి’ అని ఫోన్ చేసి మరీ మాకు ధైర్యాన్ని చెప్పారు. వారి రియాక్షన్ చూసి నవ్వాలో ఏడ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా మా పరిస్థితి ఉంటే... ఎద్దు పుండు కాకికి రుచి అన్నట్టుంది వారి పని. అయితే... సినిమా పైరసీకి గురికాగానే... ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌వారు స్పందించి, చర్యలు తీసుకున్న తీరు మాత్రం నాకు చాలా ఆనందాన్నిచ్చింది.
*** మీ ప్రేమాభిమానాలకు ప్రతిగా నా ప్రాణాలివ్వలేనా..
అనేక నెలలు కష్టపడి ఈ సినిమా తీశాం. మూడేళ్లు కష్టపడి త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ తయారు చేశాడు. 60 కోట్ల రూపాయలు వెచ్చించి బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని తీశారు. ఇన్నిరకాల వ్యయప్రయాసలకోర్చి తీసిన సినిమా రాత్రికి రాత్రి పైరసీకి గురయ్యిందంటే పనిచేసిన వారికి ఎలా ఉంటుంది చెప్పండి? నేను ‘గబ్బర్‌సింగ్-2’ స్క్రిప్ట్ విషయమై గోవాలో ఉన్నాను. సడన్‌గా త్రివిక్రమ్ నుంచి ఫోన్. సినిమా నెట్‌లో వస్తోందని. షాక్‌కి గురై.. వెంటనే బయలుదేరా. నిజానికి ఈ సినిమా విజయంపై మాకు ఎలాంటి సందేహాలు లేవు. ప్రతి ఒక్కరం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. పైరసీకి గురవ్వగానే మా మైండ్‌సెట్టే మారిపోయింది. ఒకసారి బయటకెళ్లిన సినిమాను ఇక థియేటర్లలో జనాలు ఏం చూస్తారు అనే టెన్షన్. కానీ మా సందేహాలను పటాపంచలు చేశారు నా ఫ్యాన్స్. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. మీరు లేకపోతే నేను ఉండగలనా? నా తల్లిదండ్రులు, నా అన్న, వదినల తర్వాత నాకు శక్తినీ సామర్థాన్నీ భరోసానీ ఇచ్చింది మీరు కాదా? మీరు చూపించే ప్రేమాభిమానాలకు ప్రతిగా నా ప్రాణాలివ్వలేనా?
*** రైతుగా బతకాలనే కోరిక ఇంకా బలంగానే ఉంది
నేను నటుణ్ణి అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. రైతుగా బతకాలనుకున్నాను. అది కూడా అర ఎకరం పొలం దొరికితే చాలు మొక్కలేసుకొని బతికేద్దాం అనుకున్నాను. కానీ విధి నన్ను నటుణ్ణి చేసింది. మొదటి సినిమా ‘అక్కడబ్బాయి- ఇక్కడమ్మాయి’ ఏదో మొక్కుబడిగా చేసేశాను. రెండో సినిమా ‘గోకులంలో సీత’ నాకు నచ్చింది. నా సొంత నిర్ణయంతో చేసిన ‘తొలిప్రేమ’ నన్ను పూర్తిస్థాయి నటుడిగా మార్చింది. ‘ఖుషి’ నుంచి నా మైండ్ సెట్ మారింది. నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగానే బతకడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో ఎన్నో పరీక్షలు కూడా ఎదుర్కొన్నాను. అందులో ‘అత్తారింటికి దారేది’ పైరసీ ఓ పరీక్ష. కానీ ప్రతి విషయానికీ వణికిపోయే తత్వ కాదు నాది.
*** అందుకే సమంతను అందరూ ఇష్టపడుతున్నారు
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో అవయవాలు కోల్పోయిన అభాగ్యుల గురించి ప్రభుత్వం మరిచిపోయింది. రాజకీయనాయకులు కూడా మరిచిపోయారు. కానీ సమంత మరిచిపోలేదు. తన వంతు సహాయంగా ఇద్దరికి కృత్రిమ అవయవాలను డొనేట్ చేసింది. ఇంకా చేయడానికి సిద్ధమని చెప్పింది కూడా. అందుకే ఆ అమ్మాయిని అందరూ ఇష్టపడుతున్నారు.
*** త్రివిక్రమ్ రుణం ఎలా తీర్చుకోవాలి
‘జల్సా’ తర్వాత త్రివిక్రమ్ భావజాలం, నా భావజాలం బాగా కనెక్ట్ ఆయ్యాయి. గుండెలకు హత్తుకునే భావోద్వేగాలతో కూడిన కథ దొరికితే చేద్దాం అనుకుంటున్న సమయంలో త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ కథ చెప్పాడు. అత్త పాత్రలను చులకనగా చూపిస్తున్న నేటి తరుణంలో మేనత్త అంటే తల్లితో సమానం అని చెప్పిన సంస్కారవంతుడు త్రివిక్రమ్. విలువలతో కూడిన సినిమా తీసి అటు ప్రేక్షకులకు, ఇటు నాకు ఆనందాన్ని అందించిన నా మిత్రుడు, ఆత్మీయుడు త్రివిక్రమ్ రుణం ఎలా తీర్చుకోవాలి.
*** కోట్లమందికి కృతజ్ఞత చెప్పుకోవడానికే...
‘ఖుషి’ తర్వాత సరైన సినిమా రాలేదు. కానీ సినిమాలు చేశానంటే కారణం అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమే. నేను జయాలకు పొంగిపోను, అపజయాలకు క్రుంగిపోను. పదేళ్ల తర్వాత ‘గబ్బర్‌సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తగిలినా... నేను సక్సెస్‌మీట్లు పెట్టలేదు. సినిమాల్లో నటించడం తప్ప సక్సెస్ మీట్లు పెట్టడం నాకు తొలినుంచి ఇష్టంలేదు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం సక్సెస్ మీట్ కావాలనిపించింది. కోట్లమందికి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఓ వేదికగా ఈ వేడుక నాకు ఉపయోగపడింది’’ అని పవన్ ఆద్యంతం ఉద్వేగంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇంకా త్రివిక్రమ్, కోట, బొమన్ ఇరానీ, నదియా, ప్రణీత, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, అలీ, రావు రమేష్, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు తదితరులు మాట్లాడారు.
Advertisement
Advertisement