
ఒక్కరున్నా ప్రమాదమే!
తెలిసిన శత్రువులు వంద మంది ఉన్నా ఫర్వాలేదు కానీ తెలియని శత్రువు ఒక్కరున్నా ప్రమాదమే. చావే రావచ్చు. తస్మాత్ జాగ్రత అంటున్నారు కొత్త దర్శకుడు వాసు పరిమి. హీరోగా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న జగపతిబాబు ‘లెజెండ్’తో విలన్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత వరుసగా విలన్ పాత్రలు వేస్తూ వస్తున్న ఆయన మళ్లీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పటేల్’. వారాహి చలనచిత్రం పతాకంపై సాయిశివాని సమర్పణలో సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. సర్ (ఎస్.ఐ.ఆర్) అనేది ట్యాగ్‌లైన్.
ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి క్లాప్ ఇవ్వగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు స్టైలిష్‌గా కనిపిస్తారు. టీజర్‌ను విడుదల చేశాం. ఈ టీజర్‌ను దర్శకుడు వాసు రెండు రోజుల్లో తెరకెక్కించడం నన్ను షాక్‌కు గురి చేసింది. త్వరలో రెగ్యులర్ షూట్ మొదలుపెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కెమేరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: డిజే వసంత్.