మహిళలకు సంబంధించిన కథా చిత్రాలన్నీ తన దృష్టిలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలే అంటోంది నటి శ్రద్ధా శ్రీనాధ్. శాండల్‌వుడ్‌కు చెందిన శ్రద్ధా అక్కడ యూటర్న్ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. ఇక కోలీవుడ్ ఇవన్ తందిరన్ చిత్రంతో పరిచయం అయ్యి సక్సెస్‌ను అందుకున్నా, మాధవన్, విజయ్ సేతుపతిలతో కలిసి నటించిన విక్రమ్‌వేదా చిత్రంతో అనూహ్యంగా పాపులర్ అయ్యింది.
ఇటీవల జెర్సీ అంటూ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ విజయాల ఖాతాను ఓపెన్ చేసుకుంది. ఇలా సెలెక్టెడ్ చిత్రాలలో నటిస్తూ విజయాల శాతాన్ని పెంచుకుంటూ పోతున్న శ్రద్ధా శ్రీనాధ్ తాజాగా అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న నేర్కొండిపార్వై చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కాగా ఆమె నటించిన మరో తమిళ చిత్రం కే–13.
అరుళ్‌నిధి హీరోగా నటించిన ఈ చిత్రానికి భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహించారు. ఎస్‌పీ సినిమాస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 3వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటి శ్రద్ధా శ్రీనాధ్‌తో సాక్షి చిట్ చాట్.
కాలు పెట్టిన చోటల్లా సక్సెస్ అందుకుంటున్నారు. తాజాగా తెలుగులో నటించిన జెర్సీ విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఎలా ఫీలవులతున్నారు?
చాలా సంతోషంగా ఉంది. జెర్సీ చిత్రంలో నటించడం మంచి అనుభవం. అది మానవ అనుబంధాలను ఆవిష్కరించే వైవిధ్య భరిత కథా చిత్రం. దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. నానితో నటించడం తీయని అనుభూతి.
కే–13 చిత్రం గురించి?
కే–13 అంటే ఒక అపార్ట్‌మెంట్ బ్లాక్ నెంబరు. ఇది సైకలాజికల్ మిస్టరీతో కూడిన థ్రిల్లర్ యాక్షన్ కథా చిత్రం.
కే–13 చిత్రంలో నటించడానికి కారణం?
అరుళ్‌నిధి హీరో అనగానే కథ కూడా వినకుండానే నటించడానికి సై అనేశాను. ఎందుకుంటే ఆయన గురించి నాకు తెలుసు. లక్కీగా కథ విన్నాక బాగా నచ్చేసింది.
అరుళ్‌నిధికి జంటగా నటించిన అనుభవం?
అరుళ్‌నిధి చాలా మంచి ఫెర్ఫార్మర్. ఆయనతో నటించడం చాలా కంఫర్టబుల్ అనిపించింది.
ఇందులో మీ పాత్ర గురించి?
ఇందులో మలర్‌వేది అనే రచయిత్రి పాత్రలో నటించాను. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అరుళ్‌నిధి ఫిలిం మేకర్‌గా నటించారు. మేమిద్దరం అనుకోకుండా ఒక సారి కలుస్తాం. ఆ తరువాత ఏం జరిగిందన్నదే కే –13 చిత్రం. ఇది నా కేరీర్‌లో మంచి చిత్రంగా గుర్తుండిపోతుంది. దర్శకుడు భరత్ నీలకంఠన్ కొత్తవారైనా చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా చిత్రాన్ని తెరకెక్కించారు. నేను తమిళంలో నటించిన నాలుగవ చిత్రం ఇది. చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.
నేర్కొండ పార్వై చిత్రంలో అజిత్‌తో కలిసి నటించడం గురించి?
అజిత్ లాంటి గొప్ప నటుడితో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో చాలా స్ట్రాంగ్ పాత్రలో నటిస్తున్నాను. కథలో కీలకమైన పాత్ర. సోషల్ ఎలిమెంట్స్‌తో కూడిన చిత్రం ఇది.
హింది చిత్రం పింక్‌ను చూశారా?
చూడలేదు. చూస్తే ఒరిజనాలిటి పోతుందనే చూడలేదు.
నటి కాకపోతే ఏం చేసేవారు?
కచ్చితంగా టీచర్‌ని అయ్యేదాన్ని. ఎందుకంటే మా అమ్మ కూడా ఉపాధ్యాయురాలిగా పని చేశారు. పిల్లలకు విద్య నేర్పించడం అంటే నాకు చాలా ఇష్టం.
హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. మీకు అలాంటి చిత్రాల్లో నటించాలన్న ఆశ లేదా?
నేను నటించిన విక్రమ్ వేదా, యుటర్న్ లాంటి చిత్రాలు హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలే. నా దృష్టిలో మహిళలకు సంబంధించిన కథా చిత్రాలన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలే.
ఎలాంటి పాత్రలో నటించాలని కోరుకుంటున్నారు?
కల్పనా చావ్లాగా నటించాలనుంది. నాసా శాస్త్రవేత్తగా ఆమె ఖ్యాతి అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంతగా శ్రమించారో. ఆమె మరణం కూడా నామనసును కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment