అడిగినా ఇవ్వడం లేదు
బాలీవుడ్‌తో పోల్చితే నా పారితోషికం తక్కువే కదా అంటోంది కాజల్ అగర్వాల్. తమిళం, తెలుగు, హిందీ అంటూ బహుభాషా నటిగా వెలుగొందుతోంది కాజల్. అయితే ఈ మూడు భాషల్లోనూ ఒకటి, రెండు చిత్రాలే ఈ అమ్మడి చేతిలో వున్నాయి. అయినా పారితోషికం మాత్రం నిర్మాతలు కళ్లు బైర్లు కమ్మే స్థాయిలో డిమాండ్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. కాజల్ అగర్వాల్ తమిళంలో జిల్లా చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. త్వరలో బాలాజి మోహన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతోంది. అలాగే తెలుగులో రామ్‌చరణ్ సరసన నటించిన గోవిందుడు అందరివాడే చిత్రం బుధవారం తెరపైకి వచ్చింది.
మరో చిత్రం చేతిలో ఉంది. హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ అధిక పారితోషికం డిమాండ్ చేస్తోదనే ప్రచారం జోరందుకుంది. దీనిపై కాజల్ స్పందిస్తూ పారితోషికం అనేది వారి వారి మార్కెట్‌ను బట్టి నిర్ణయిస్తారని చెప్పింది. తాను అదే విధంగా పారితోషికం తీసుకుంటున్నానని అంది. మరో విషయం ఏమిటంటే అధిక పారితోషికం కావాలంటూ డిమాండ్ చేయలేదని స్పష్టం చేసింది.
వాస్తవానికి కోటి,కోటిన్నర అన్నది సాధారణ పారితోషికమేనంది. బాలీవుడ్ హీరోయిన్ల కంటే తాను తీసుకుంటున్న పారితోషికం చాలా తక్కువని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే తమ వృత్తి చాలా ప్రమాదకరమైందని అంది. దుస్తులకే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నామని చెప్పింది. నిజం చెప్పాలంటే తానడిగిన పారితోషికం ఎవరూ ఇవ్వడం లేదని, నిర్మాతలే తమ పారితోషికాన్ని నిర్ణయిస్తున్నారని కాజల్ నిష్టూరంగా పేర్కొంది.