‘ఈ క్షణం ఎన్నో భావోద్వేగాలు నన్ను చుట్టుముట్టాయి. పాలు పట్టడం, డైపర్లు మార్చడం, వాళ్లతో ఆడుకోవడం.. ఓ గాడ్.. ఇలా ఒక్కటేమిటి ప్రస్తుతం నాకోసం ఎన్నో పనులు ఎదురుచూస్తున్నాయి. వారిద్దరిని ముంబైకి తీసుకువచ్చే రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానంటూ’ మోడల్, బాలీవుడ్ హీరోయిన్ లీసా రే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న రెండేళ్ల తర్వాత(2012) తన చిరకాల మిత్రుడు జాసన్ డేహ్నిని పెళ్లాడారు లీసా. తన వైవాహిక జీవితం ఎన్నో సంతోషాలతో కొనసాగుతోందని.. తన కూతుళ్ల రాకతో అది పరిపూర్ణమైందని భావోద్వేగానికి లోనయ్యారు.
అవును లీసా రే ప్రస్తుతం ఇద్దరు ఆడపిల్లలకు తల్లి. అది కూడా కవలలు. జార్జియాలో జన్మించిన తన కవలలు ఇండియాకు రాగానే మనకు పరిచయం చేస్తారట. అదేంటి లీసా రే ఎప్పుడు గర్భం దాల్చారు.. ఆమె పిల్లలు జార్జియాలో జన్మించడమేంటని ఆశ్చర్యపోకండి. అసలు విషయమేమిటంటే.. సరోగసి ద్వారా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు లీసా రే.
ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న లీసా.. తన జీవితంలో ఏదీ ప్రణాళిక ప్రకారం జరగలేదని, అయితే తన భర్త కూతుళ్ల రూపంలో తనకు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చారంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జీవితంలో నిలదొక్కుకున్నానని, క్యాన్సర్ బారిన పడినప్పటి నుంచి, తల్లిగా మారడం దాకా తన ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ప్రతీ ఒక్కరికి తెలియజేస్తానన్నారు. ‘రోగాల బారిన పడినంత మాత్రాన.. జీవితం కోల్పోయినట్లు కాదు.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. వైద్యరంగంలో వచ్చిన మార్పుల వల్ల నేడు అన్నీ సాధ్యమే. అందుకు నేనే ఉదాహరణ. కాబట్టి ఎప్పుడూ నిరాశ చెందవద్దంటూ’ స్ఫూర్తి నింపారు.
Comments
Please login to add a commentAdd a comment