ముంబై:. శ్రీలంక పౌరయుద్ధం ఆధారంగా తీసిన మద్రాస్‌కేఫ్ సినిమా జాన్ అబ్రహం, నర్గిస్ ఫక్రికి మంచి పేరు తెస్తుందని షూజిత్ సర్కార్ ఘంటాపథంగా చెబుతున్నాడు. తన కొత్త సినిమా మద్రాస్ కేఫ్ ఫలితంపై దర్శకుడు ఎంతో ధీమాగా ఉన్నాడు. నటుల్లోని రక్తం పీల్చి అయినా వారి నుంచి ఫలితం రాబట్టడం తనకు తెలుసన్నాడు. మద్రాస్‌కేఫ్‌లో వీళ్లద్దరూ అద్భుతంగా నటించారని కితాబిచ్చాడు.
పదేళ్లుగా బాలీవుడ్‌లో ఉంటూ ధూమ్, దోస్తానా, హౌస్‌ఫుల్ 2, రేస్ 2, షూటౌట్ ఎట్ వాడాలా వంటి పెద్ద చిత్రాల్లో నటించినా జాన్‌కు ఇప్పటికీ పెద్దనటుడిగా గుర్తింపు లేదు. రాక్‌స్టార్‌తో హిందీ సినిమాల్లోకి వచ్చిన నర్గిస్ ఫక్రి నటన ఏమీ బాగాలేదని విమర్శలు రావడంతో ఈ బ్యూటీ కెరీర్ కూడా ప్రమాదంలో పడింది. శుక్రవారం విడుదలవుతున్న మద్రాస్‌కేఫ్ చూసిన తరువాత ప్రేక్షకులు జాన్, నర్గిస్‌పై ఇది వరకు ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటారని సర్కార్ అంటున్నాడు.