
బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఇటీవలే ఓ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శివమ్ నాయర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది డిప్లొమాట్ ఈనెలలోనే థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో విడుదలైన తొలివారంలోనే రూ.20 కోట్ల మార్క్ చేరుకునేందుకు దగ్గరలో ఉంది. ఈ సందర్భంగా హీరో జాన్ అబ్రహం ఓ ఆసక్తకర విషయాన్ని పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన జాన్ తన మూవీని కొనేందుకు ఎవరూ కూడా ముందుకు రాలేదని అన్నారు. స్టూడియోలతో పాటు ఓటీటీలు కూడా ఆసక్తి చూపలేదని వెల్లడించారు.
ది డిప్లొమాట్‌పై జాన్ అబ్రహం మాట్లాడుతూ..'మొదట మా సినిమా స్టూడియోలు నమ్మలేదు. కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఓటీటీలను సంప్రదిస్తే వారు కూడా తిరస్కరించారు. ఎందుకంటే మా సినిమాను తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే ఈ సినిమా నిర్మించిన నిర్మాణ సంస్థ సామర్థ్యంపై వారికి నమ్మకం లేదు. అందువల్లే మా సినిమాపై వారికి ఎలాంటి అంచనాలు లేవు. అయితే థియేటర్లలో రిలీజైన తర్వాత వారి నిర్ణయం తప్పు అని నిరూపించాం. జీరో నుంచి మొదలై ప్రేక్షకుల అభిమానం సాధించాం. మా చిత్రంపై సున్నా అంచనాలు ఉండటమే మాకు కలిసొచ్చింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత కొంతమంది వచ్చి గత పదేళ్లలో ఈ బ్యానర్‌లో ఉత్తమ చిత్రం ఇదే అని అన్నారని' వెల్లడించారు
కాగా.. ది డిప్లొమాట్ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. భారతీయ దౌత్యవేత్త జేపీ సింగ్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో ఆయన పాత్రలో జాన్ కనిపించాడు. ఈ మూవీలో సాదియా ఖతీబ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని జాన్స్ జేఏ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు టీ సిరీస్, ఫార్చ్యూన్ పిక్చర్స్, సీతా ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. మార్చి 14న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.19 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment