తెలుగు రాష్ట్రాల్లో టీవీ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే షోల్లోఒకటి ‘బిగ్‌బాస్’. ఇందులో పాల్గొనే అవకాశం ఎన్నో వడపోతల తర్వాత వస్తుంది. అలాంటిది ‘ఫన్‌బకెట్’ కామెడీ స్కిట్లతో సోషల్ మీడియా ద్వారా యూత్‌కు చేరువైన మహేష్ విట్టా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని బిగ్‌బాస్–3 హౌస్‌లో ఏకంగా 84 రోజులు ఉన్నాడు. గతవారం ఎలిమినేట్ అయ్యాక ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడాడు. లోపల జరిగేవన్నీ నిజం కాదని, నాగార్జున ఓన్లీ స్క్రిప్ట్‌ని మాత్రమే ఫాలో అవుతారని..ఇలా ఎన్నో విషయాలను పంచుకున్నాడు.ఆవి మహేష్ మాటల్లోనే..
సాక్షి,సిటీబ్యూరో: వాస్తవానికి నేను ‘బిగ్‌బాస్–2’కి వెళ్లాల్సిన వాడిని. అప్పుడు ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా షూటింగ్ చివర్లో ఉన్నాను. అదే సమయంలో ‘బిగ్‌బాస్’లోకి మహేష్ విట్టా వస్తే బాగుంటుందని ‘స్టార్ మా’కి నాని అన్న చెప్పారు. అప్పుడు ‘మా’ యాజమాన్యం నన్ను సంప్రదించింది. షూటింగ్స్‌లో బిజీ ఉండి రాలేనని.. వచ్చే ఏడాది వస్తాననడంతో సీజన్–3కి రావాలని పిలిచారు. తెలిసిన డైరెక్టర్లు, స్నేహితుల సలహాలు తీసుకుని అంతా ఓకే అనుకున్నాక ఓకే చెప్పా. అలా నాని మాట సాయం వల్ల వెళ్లానే తప్ప విజేత అవ్వాలని మాత్రం కాదు. నన్ను నేను టీవీలో చూసుకోవడానికి, ప్రేక్షకులకు ‘వాట్ ఈజ్ మహేష్ విట్టా’ అని చెప్పడం కోసం వెళ్లా.
తల్లి రమణమ్మతో మహేష్ విట్టా
నెగిటివ్ చెప్పడం చాలా కష్టం
హౌస్‌లోకి అడుగుపెట్టాక చాలా సంతోషమనిపించింది. అందరం కొత్త ముఖాలే అయినా కలిసిపోయాం. కబుర్లు చెప్పుకుంటూ బాగానే ఉంటున్న సమయంలో టాస్క్‌లు ఇస్తారు. ఏవో చిన్న చిన్న గొడవలు. వాటిని చాలా పెద్దగా చిత్రీకరిస్తారు. ఓ వ్యక్తి గురించి నెగిటివ్‌గా చెప్పాలి అంటే ఎలా చెప్తాం? అంత తప్పు ఆ వ్యక్తి ఏం చేశాడని చెప్పాలి? సరే.. బిగ్‌బాస్ చెప్పాడు కదా అని చెప్తాం.. మళ్లీ పొద్దున లేచాక ఆ మనిషి ముఖం చూడాల్సిందేగా? ఇన్ని సమస్యలు ఉండబట్టే లోపల ప్రతి ఒక్కరికీ చాలా మెంటల్ టెన్షన్ ఉంటుంది. బయటకు చెప్పుకోలేం. మీరు చూస్తున్నది వేరు, లోపల జరుగుతున్నది వేరు.
ఫుడ్ విషయంలో ఇబ్బంది పడ్డా..
హౌస్‌లో ఫుడ్‌కి చాలా ఇబ్బంది పడాలి. ఒక మనిషిని ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెడతారు. వాళ్లకు నచ్చిన కూరగాయాల్ని పంపుతారు. ఆ కూరగాయలు కూడా ఫ్రెష్ ఉండవు. వారానికి సరిపడా పంపే రేషన్‌లో కొన్ని ముఖ్యమైన నిత్యావసర సరుకులు ఉండవు. ఒకసారి కూరలో వేసుకునే కారం పంపలేదు. దాంతో మాదగ్గరున్న ఎండు మిర్చిని దంచి కారంలా చేసి కూరల్లో వాడుకున్నాం. లోపల పరిస్థితి ఎలా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
లైట్స్ ఆపితేనే పడుకోవాలి
లోపల ఉన్న మాకు రాత్రి– పగలు ఎప్పుడో తెలియదు. బిగ్‌బాస్ లైట్లు ఆపి పడుకోండి అంటే పడుకోవాలి, లైట్లు ఆన్‌చేసి లేవమంటే లేవాల్సిందే. నైట్ టైం పోలీసుల పెట్రోలింగ్ వాహనాల సైరన్ విని రాత్రి అయ్యిందేమో అనుకునేవాళ్లం. ఇంటి నుంచి లెటర్స్ వస్తే వారు చదివి, బయట విషయాలు లేవంటేనే మాకు సమచారం ఇస్తారు.
నాగార్జునకు కూడా తెలియదు
వాస్తవానికి హౌస్‌లో ఏం జరుగుతుందనే పూర్తి విషయాలు నాగార్జున గారికి కూడా తెలియనివ్వరు. వారు ఇచ్చిన స్క్రిప్ట్‌ని మాత్రం ఆయన ఫాలో అవుతారు. ఆయన కూడా ఎవ్వరినీ బలవంతంగా తిట్టే వ్యక్తి కాదు, ఇబ్బంది పెట్టేవారు అసలే కాదు. అసలు నేను ఎందుకు పనికిరానని అందరూ అనుకున్న సమయంలో నాగ్ సార్ ‘మహేష్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్, నీ స్టైల్లో నువ్వు ఆడు’ అంటూ సపోర్ట్ చేశారు. దసరా రోజు హౌస్‌లోకి వచ్చినప్పుడు నాతో సరదాగా ఉన్నారు. ఆ హ్యాపీ మూమెంట్ స్వీట్ మెమరీ. నాకు బాగా నచ్చిన వ్యక్తి బాబా మాస్టర్. ఓట్ల ప్రకారంగా రాహుల్ విన్నర్. లోపల ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్ కావొచ్చు. ఆ రాజకీయాలు ఏంటనేవి నేను చెప్పను. హౌస్ నుంచి రాగానే అమ్మని కలిశాను. కొన్నిరోజులు కేరళ వెళతా. టీఆర్‌పీ రేటింగ్స్ కోసం గత వారంలో అయిన గొడవను టీవీలో ఫ్రెష్‌గా చూపిస్తారు. పునర్నవి, రాహుల్, నేను, వితిక, వరుణ్ ఫ్రెండ్స్. మా మధ్య సరదా సంఘటనలు జరిగాయి. వీటిని ఎడిటింగ్ చేసి పునర్నవి, రాహుల్ మధ్య ఏదో ఉందన్నట్టు టెలికాస్ట్ చేశారు. అక్కడ అదేం లేదు.
Comments
Please login to add a commentAdd a comment