‘‘70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ముఖ్యోద్దేశం ప్రేక్షకులను డిఫరెంట్‌గా ఎంటర్‌టైన్ చేయడమే. ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ ఇప్పుడు ‘యాత్ర’. ఇది పొలిటికల్ సినిమా అయినప్పటికీ పాలిటిక్స్ ఉండవు. కేవలం వైయస్సార్‌గారి సోల్, స్పిరిట్‌ను ఈ సినిమాలో చూపించాం’’ అని విజయ్ చిల్లా అన్నారు. మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో వైఎస్సార్‌గా మమ్ముట్టి నటించిన చిత్రం ‘యాత్ర’. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం రిలీజైంది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ – ‘‘మహీ వి. రాఘవ్ నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు కాంట్రవర్శీ ఎందుకు? అన్నాను.
కానీ తను చెప్పిన సన్నివేశాలు విన్నాక సినిమా మొత్తం ఇదే ఎమోషన్‌తో ఉంటే చేద్దాం అనుకున్నాను. మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలామంది ఫోన్ చేసి ‘పెద్దాయన్ని గుర్తు చేశారు, బరువైన హృదయంతో, చెమర్చిన కళ్లతో ప్రేక్షకులు బయటకు వస్తున్నారు’ అని అంటున్నారు. ఈ సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది. మా బడ్జెట్‌కు మంచి ఓపెనింగ్ లభించింది’’ అన్నారు. ‘‘అభిమానానికి, కళకి వెల కట్టలేము. ‘రుణం తీర్చుకోలేము స్వామి’ అని ప్రేక్షకులు అంటున్నారు. మేం కేవలం ఒక నాయకుడి కథ అనుకొని కథ చెప్పాం. ఇలాంటివి వింటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మహా అయితే ఇంకో 4–5 సినిమాలు తీస్తానేమో కానీ ఇంత అభిమానం రాకపోవచ్చు.
కలెక్షన్స్, సినిమా రేటింగ్స్ కాదు చిన్న చిన్న సన్నివేశాలు కూడా గుర్తుపెట్టుకుని అభినందిస్తుండటం సంతోషంగా ఉంది. మనం అన్నింటినీ అంకెల్లో చూడటానికి అలవాటు పడ్డాం. ఈ అంకెల్లో కొలవడం మనం ఆపేయాలి. వరంగల్, నల్గొండ ప్రాంతాల నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఒక నాయకుడిని ఇంత అభిమానిస్తున్నారా? అనుకున్నాను. భయమేసింది. ఇది తెలిసి ఉంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవాణ్ని కాదేమో. ‘మాతృదేవోభవ’ సినిమా చూసి ఏడ్చాం. మళ్లీ ‘పితృదేవోభవ’ సినిమా చూపించి ఏడిపిస్తున్నారండీ అని అంటున్నారు. 2–3 సన్నివేశాల తర్వాత మమ్ముట్టిగారు ప్రేక్షకుడిని కచ్చితంగా సినిమాలోకి తీసుకెళ్తారని నమ్మాం.
రెస్పాన్స్ అలానే ఉంది’’ అని మహీ వి. రాఘవ్ అన్నారు. ‘‘యాత్ర’లో కేవీపిగారి పాత్ర పోషించాను. ‘విలేజ్‌లో వినాయకుడు’కు మహీ నిర్మాతగా చేశారు. అప్పుడు తెలియలేదు కానీ అతని డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సినిమా చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. గొప్ప నాయకుడి కథ చెప్పేటప్పుడు కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ చెప్పడం కుదరదు. పాదయాత్రే ఉంది. రాజకీయాల గురించి చెడుగా చెబుతారు. కానీ సినిమా చూస్తుంటే ఎంతో గౌరవంగా ఉంది.
ఇంటిని సెట్ చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది. ఇంతమందికి సహాయపడాలంటే నాయకులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. వైయస్‌గారి పాత్ర తాలూకు బరువు మోయాలంటే కష్టం. కానీ మమ్ముట్టిగారు దాన్ని భూజాన మోసిన విధానం గ్రేట్. ఆలోచింపజేసేంత గొప్ప సినిమా ఇది. స్క్రీన్ మీద మమ్ముట్టిగారు, నాకూ మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తే ముచ్చటేసింది’’ అన్నారు రావు రమేశ్.
Comments
Please login to add a commentAdd a comment