జీవితం... కష్టసుఖాల మిశ్రమం. నటన... జయాపజయాల కలబోత. ఎంతో పరిణతి ఉన్నవాళ్లే ఈ రెంటినీ ఒకేలా చూడగలుగుతారు. మంచు విష్ణుకి ఆ పరిణతి ఉంది. ‘ఆనందం వచ్చిందా.. తీసుకుందాం.. బాధ వచ్చిందా.. తీసుకుందాం’ అనేంత పరిణతి. ‘సాక్షి’తో ఎక్స్‌క్లూజివ్‌లో విష్ణు పంచుకున్న విషయాలు.
► గాయత్రి, ఆచారి అమెరికా యాత్ర, ఓటర్.. మూడు సినిమాల గురించి?
‘గాయత్రి’ నాకో డిఫరెంట్ మూవీ. ‘ఆచారి అమెరికా యాత్ర’ ఫన్నీగా ఉంటుంది. కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ అయితే మంచి సినిమా అవుతుంది. నన్ను ఓ సూపర్‌స్టార్ రేంజ్‌కి తీసుకెళ్లే మూవీ ‘ఓటర్’. తగిలిందంటే ఆ సినిమా నాకు ‘అసెంబ్లీ రౌడీ’ అవ్వొచ్చు.
► ‘గాయత్రి’లో మీకు, శ్రియకు మధ్య ఉన్న ‘ఒక నువ్వు.. ఒక నేను.. ఒక్కటయ్యాం మనం’ పాట చాలా బాగుంది..
ఈ ఏడాదిలో వన్నాఫ్ ది బెస్ట్ సాంగ్ ఇది. మా ఇద్దరి మధ్య బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ఉంది. ఒక నటుడిగా ‘గాయత్రి’ నాకు అగ్నిపరీక్ష. నా హిట్ సినిమాలన్నీ కామెడీ బేస్డ్. ‘గాయత్రి’లో శివాజీలాంటి క్యారెక్టర్‌ని నేనింతవరకూ చేయలేదు. కథ విన్న వెంటనే జస్ట్ పదిహేను ఇరవై నిమిషాలు వచ్చే నా క్యారెక్టర్‌తో ఆడియన్స్ లాక్ అయ్యారంటే ఫెంటాస్టిక్‌గా ఉంటుందనిపించి చేశా.
► పాటలో శ్రియకు జడ వేశారు. మీ భార్య విన్నీగారికి ఎప్పుడైనా జడలు వేశారా?
లేదు. జడలు వేయడం తెలియదు. ఇప్పుడిప్పుడే అరీ, వివీకి వేస్తున్నా. అది కూడా కష్టపడి. జడలు విప్పడం వచ్చు. అరీ అడుగుతుంది ‘డాడీ.. నువ్వెందుకు చేయవు ఇవన్నీ. మమ్మీయే ఎందుకు జడ వేయాలి’ అని. నాన్నకి ప్రాక్టీస్ లేదు అంటే ‘ఎప్పుడు నేర్చుకుంటారు’ అని అడుగుతుంది.
► ఒకవైపు హీరోగా, నిర్మాతగా.. మరోవైపు స్కూల్స్ చేసుకోవడం.. మల్టీ టాస్కింగ్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా లైఫ్ అంతే కదా. నాన్నగారు చేసేది చూశాను. మెల్లగా అలవాటయ్యాను. అదీ చూసుకోవాలి ఇదీ చేయాలి అంతే. ఈ వాతావరణంలో పెరిగాను కాబట్టి నాకు సులభమైంది. వన్స్ షూటింగ్ లొకేషన్‌కి వెలితే అన్నీ స్విచాఫ్ చేసేస్తాను. ఎవరూ నన్ను కలవడానికి.. ఫోన్‌లో మాట్లాడ్డానికి వీల్లేదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ సెట్‌లో నా వద్ద ఫోన్ ఉండదు. స్కూల్స్ పనులు చూసుకునేటప్పుడు కూడా అంతే. వేరే విషయాల గురించి ఆలోచించను.
► మీరు తీయాలనుకున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’ గురించి ?
‘భక్తకన్నప్ప’ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ రెడీ అయింది. తనికెళ్ల భరణిగారి వెర్షన్ తీసుకుని నేను, ఓ హాలీవుడ్ రైటర్ కూర్చుని ఓ వెర్షన్ తయారు చేశాం. బుర్రా సాయిమాధవ్‌గారు డైలాగులు రాస్తున్నారు. ఆయన వెర్షన్ అంతా ఓకే అయిన తర్వాత భరణిగారు దానికి ఓకే చెప్పాలి. ఎందుకంటే.. ఆయన కథని మేం తీసుకుని చేస్తున్నాం కాబట్టి. ఆ సినిమాకి 70 నుంచి 80కోట్లు ఖర్చవుతుంది. ఈ రోజు నా మార్కెట్ అంత లేదు. ఈ మూడు సినిమాల తర్వాత పెరుగుతుంది. జరిగేది జరుగుతుందిలే అని ఈశ్వరుడిపై భారం వేసి ముందుకెళుతున్నాం. ఈ ఏడాది ఎండింగ్‌కి ప్రొడక్షన్‌కి వెళ్లిపోతాం. ఈ మూవీని హాలీవుడ్ డైరెక్టర్ తీస్తారు.
► టూ క్యూట్ డాటర్స్, వన్ క్యూట్ సన్... ఎలా ఉంది లైఫ్?
ఫాదర్‌హుడ్ ఈజ్ నాట్ ఈజీ జాబ్. కూతుళ్లు ఎంత అల్లరి చేసినా భరించాల్సిందే. అందుకే విన్నీతో అవ్రామ్ దగ్గర నో కాంప్రమైజ్. అల్లరి చేస్తే వీపు వాయించేస్తా అంటా.
► ఇద్దరు కూతుళ్లు పుట్టాక వారసుడు కావాలనే ఆలోచన ఉండేదా?
నాకెవరైనా ఒకటే. ఒకవేళ మూడో సంతానం ఆడపిల్ల పుట్టినా సంతోషమే. జనరల్‌గా ఆడపిల్లల్ని వారసులుగా ప్రకటì ంచరేమో. కానీ నేనలా కాదు అవ్రామ్ కన్నా ఆరి, వివి (ఆరియానా, వివియానా) పెద్దవాళ్లు. పెద్దవాళ్లకు బాధ్యతలు అప్పగించాలన్నది నా ఒపీనియన్. మగాడికి ఎక్కువ బాధ్యతలు ఇచ్చి, ఆడవాళ్లకు తక్కువ బాధ్యతలు ఇవ్వడం అనేది బుల్‌షిట్ అండి. ఇంతకుముందు ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఇతర కారణాల వల్ల ఆడవాళ్లను బయటకు రానివ్వలేదు. ఒక్కసారి మన పురణాల్లోకి వెళ్లండి. చరిత్ర చూస్తే ఆడవాళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉండేవారు. శక్తి అని అంటాం. ఎక్కడా మగాడ్ని రిఫర్ చేయలేదు. శక్తి అంటే అది ఫీమేల్ పవర్. స్త్రీ లేకపోతే లైఫ్ లేదు.
► పుస్తకాలు బాగా చదువుతారా?
బాగా. జర్నీస్ అప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఏదైనా నవల కొనుక్కుని, ఫ్లైట్ ఎక్కగానే చదవడం మొదలుపెడతా.
► జయాపజయాలకు అతీతంగా స్పందించే సహనం బుక్ రీడింగ్ ద్వారానూ వస్తుందా?
అవును. యాక్చువల్లీ నా ప్రతి సినిమా రిలీజ్ ముందు రుడియార్డ్ కిప్లింగ్ రాసిన ‘ఇఫ్’ అనే పోఎమ్ చదువుతూ ఉంటాను. ఆ పోఎమ్‌ని నా 12 క్లాస్‌లో ఉన్నప్పుడు చదివాను. ఒక ఫాదర్ వాళ్ల కొడుక్కి రాసిన లెటర్ అది. అందులో ‘నువ్వు రాజుని, మామూలువాళ్లని ఒకేలా చూడగలిగితే, ఇలా ఇలా ఉండగలిగితే..’ అంటూ లాస్ట్‌లో ఓ మాట చెబుతాడు. అదేంటంటే.. ‘నువ్వు సక్సెస్, ఫెయిల్యూర్ అనే ఇద్దరు మోసగాళ్లను ఒకేలా చూడగలిగితే నువ్వు గెలిచినట్టు’ అని. చాలా బ్యూటిఫుల్ పోఎమ్. వెరీ ఇన్స్‌పిరేషనల్.
► ఈ మధ్య థియేటర్స్ కొరతతో సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఏమంటారు?
ఇకనుంచి సోలో రిలీజ్‌లు ఉండవు. రెండు మూడు సినిమాలు మినిమమ్ ఉంటాయి. 2 సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమాకు 60 శాతం ఇచ్చి ఇంకొకరికి 40 ఇస్తే ఓకే. అలా కాకుండా 85 శాతం ఒక సినిమాకి 25 ఇంకో సినిమాకి అంటే చాలా తప్పు. 25 శాతం మాత్రమే థియేటర్లు దక్కే నిర్మాతకు ఎంత నష్టం? ఇలా జరగకుండా ఉండాలంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డిస్కస్ చేయాలి.
► హాలీవుడ్ మూవీస్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారని విన్నాం..
యస్. త్వరలో హాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అమేజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ సినిమా పరిస్థితిని మార్చేయబోతున్నాయి. యాపిల్ కూడా వస్తుంది. లాస్ ఏంజల్స్‌లో చదువుకొని వచ్చాక నేను నటించిన ‘విష్ణు’ సినిమాని అన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేసేయండి. 3 వీక్స్‌లో రిటర్న్స్ వచ్చేస్తాయి అంటే చాలా మంది నిర్మాతలు నవ్వారు. వీడేదో అమెరికా నుంచి దిగాడు అని కామెడీ చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అదే. ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. పదేళ్ల క్రితమే నేను ఈ మాట అన్నాను.
– డి.జి. భవాని
ఆ ఇద్దరు మోసగాళ్లను ఒకేలా చూడాలి
Published Tue, Feb 6 2018 12:40 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment