
మోహన్‌లాల్, నిఖిత, షీలు అబ్రహాం ముఖ్య తారలుగా ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘కనల్’. ఇప్పుడీ చిత్రం ‘మహా పల్లవ’ అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కె.వి.ఎస్ మూవీస్ పతాకంపై కల్లూరు సుబ్బయ్య సమర్పణలో కల్లూరు శేఖర్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ– ‘‘కనల్’ అంటే నిప్పులాంటివాడు, నిజాయితీపరుడు అని అర్థం. కొందరు సంఘవిద్రోహ శక్తుల ఆటను ఓ వ్యక్తి ఎలా ముగించాడన్నదే ఈ చిత్రకథ. రాజస్థాన్‌లోని థార్ ఎడారి, దుబాయ్, అమెరికా లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. ఇందులో ఐదు పాటలు, మూడు ఫైట్లు ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నాం. మలయాళంలో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని అన్నారు.