డిజిటల్ ప్రొవైడర్ల విధానాల కారణంగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్స్ మండిపడింది. కేవలం తమ లాభాలనే దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలు సినీ పరిశ్రమలో అందరికీ నష్టాలను మిగులుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన చార్జీలను వసూలు చేయాలని దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్స్ పలుసార్లు డిజిటల్ ప్రొవైడర్లను కోరినా ఎలాంటి స్పందన రాకపోవడంతో థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చారు.
ఈ విషయమై దక్షిణాది రాష్ట్రాల ఫిల్మ్ ఛాంబర్ల పెద్దలు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలుగు నిర్మాతలు సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు పి. కిరణ్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె. మురళీ మోహన్, చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు ఎల్.సురేష్, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు విశాల్, కేరళ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సియాద్ కొక్కర్‌లు ఈసమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిజిటల్ ప్రొవైడర్లు అన్యాయంగా చార్జీలు వసూలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. తక్కువ ధరకే సేవలు అందించడానికి ముందుకు వస్తున్న డిజిటల్ ప్రొవైడర్లను సైతం అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ విషయంపై మరో వారం రోజుల్లో రెండో సమావేశాన్ని నిర్వహించి ధరల తగ్గుదల, ఇతరత్రా విషయాలపై పరిష్కారానికి కృషి చేయాలని తీర్మానించారు. ఒకవేళ కుదరని పక్షంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మార్చి 1 నుండి థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment