తాప్సీ ఎందుకు పరుగులు తీస్తోంది?
తాప్సీ బాలీవుడ్‌లోకి వెళ్లిన తర్వాత చేస్తున్న తాజా సినిమా 'నామ్ షబానా'. ఈ సినిమా పోస్టర్‌ను బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
తాప్సీ బాలీవుడ్‌లోకి వెళ్లిన తర్వాత చేస్తున్న తాజా సినిమా 'నామ్ షబానా'. ఈ సినిమా పోస్టర్‌ను బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో తాప్సీ పరుగులు తీసేందుకు సిద్ధంగా కనిపించగా, మిగిలిన నటులంతా ఆమె చుట్టూ కనిపిస్తారు. ఈ పోస్టర్ చూస్తుంటే తనకు ఒక విషయం గుర్తుకొస్తుందని, ''ఆడవాళ్లు నిస్సహాయంగా ఎప్పుడు ఉంటారంటే.. వాళ్ల గోళ్ల రంగు ఆరిపోతున్నప్పుడే'' అని అన్నారు. విషయం ఏమిటంటే, తాప్సీ నటిస్తున్న తాజా చిత్రం.. ఇంతకుముందు అక్షయ్ కుమార్ నటించిన థ్రిల్లర్ మూవీ 'బేబీ'కి ప్రీక్వెల్.
నామ్ షబానా సినిమా.. ఉగ్రవాదుల మీద విరుచుకుపడే అండర్ కవర్ ఏజెంట్ల గురించి ఉంటుంది. ఇంతకుముందు తాప్సీ నటించిన పింక్ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. బాలీవుడ్‌లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఈమధ్య కాలంలో ఎక్కువగా రావట్లేదు. ఇలాంటి సమయంలో ఈ సినిమా రావడం గమనార్హం. ఈనెల పదోతేదీన సినిమా ట్రైలర్ విడుదల చేస్తామని, సినిమాను మార్చి 31న తీసుకొస్తామని అంటున్నారు. శివమ్ నాయర్ దర్శకత్వంలో వస్తున్న నామ్ షబానాలో ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు దక్షిణాది స్టార్ పృథ్వీరాజ్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఎక్కువగా ముంబై, మలేసియాలలో చిత్రీకరించారు.