పదేళ్లు పూర్తయ్యాయి.. ఏమాత్రం బిడియం లేదు!! | Nani Turns Into 10 As Actor | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 5 2018 7:47 PM | Last Updated on Wed, Sep 5 2018 8:46 PM

Nani Turns Into 10 As Actor - Sakshi

‘ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా... నీ పంట పండిందే ప్రేమా..’ అంటూ లావణ్యను ఆటపట్టించి మరీ ఆమె ప్రేమను గెలుపొందాడు రాంబాబు. మహేష్‌.. మహేష్‌ అంటూ కలువరించే లావణ్యను ప్రేమను పొందేందుకు రాంబాబు పడ్డ పాట్లు నవ్వు తెప్పించడంతో పాటు అతడిపై జాలి కలిగిస్తాయి. రెండు జంటల ప్రేమకథతో తెరకెక్కిన అష్టాచమ్మా సినిమా విడుదలై నేటికి సరిగ్గా పదేళ్లు. ఈ సినిమా గురించి ఎందుకీ ప్రస్తావన అనుకోకండి.. ఎందుకంటే ఈ సినిమా రూపంలోనే టాలీవుడ్‌కు నాచురల్‌ స్టార్‌ ‘నాని’  దొరికాడు.

డైరెక్టర్‌ కావాలనుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నవీన్‌ బాబు ఘంటా అలియాస్‌ నాని... నాచురల్‌ స్టార్‌గా ఎదిగి ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. తన పదేళ్ల నటనా ప్రస్థానంలో ఎవరి ముందు నటించడానికైనా బిడియపడలేదని చెబుతూ ఇండస్ట్రీలో స్థిరపడిపోయాడు ఈ డబుల్‌ హ్యాట్రిక్‌ హీరో.

గాడ్‌ఫాదర్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నవీన్‌ బాబు... పక్కింటి కుర్రాడిలా కన్పిస్తూనే... ‘హీరోగా నెగ్గడం అంటే ఇష్టంగా పనిచేయడం’  అంతే అనే లాజిక్‌తో దూసుకుపోతున్నాడు. రాంబాబు క్యారెక్టర్‌తో యువతకు దగ్గరైన ఈ సహజ నటుడు... విలక్షణమైన కథలు ఎన్నుకుంటూ తన విజయ పరంపరను, నటనా ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నాడు.

అలా మొదలైంది ఇచ్చిన బూస్ట్‌తో..
తొలి రెండు సినిమాల్లో(అష్టాచమ్మా, రైడ్‌) మిగతా హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న నాని.. ‘స్నేహితుడా’ సినిమాతో సోలో హీరోగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత భీమిలీ కబడ్డీ జట్టులో సూరిబాబుగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. 2011లో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరెక్కిన ‘అలా మొదలైంది’  మూవీతో నాని కెరీర్‌ ఊపందుకుంది. ఈ సినిమాలో ‘గౌతమ్‌’ గా నాని నటన సూపర్బ్‌. ప్రతీ ఇంటిలోనూ ఇలాంటి ఓ కొడుకు ఉండాలనిపించేంతగా ఉంటుంది తల్లితో గౌతమ్‌ అనుబంధం.

బడా డైరెక్టర్లతో...
పిల్ల జమీందార్‌తో హిట్‌ కొట్టిన ఈ యువహీరో రాజమౌళి దృష్టిలో పడటంతో ఈగ సినిమాలో నటించే చాన్స్‌ కొట్టేశారు. ఈగ విజయంతో బడా డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇక గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ నటుడిగా నానిని మరో మెట్టు ఎక్కించింది. ఈ సినిమాలో ‘వరుణ్‌’ గా జీవించిన నానిని నంది అవార్డు వరించింది. 2014లో విడుదలైన కృష్ణవంశీ పైసా, ఆహా కళ్యాణం, జెండాపై కపిరాజు సినిమాల ఫలితం నాని కెరీర్‌పై ఎటువంటి ప్రభావం చూపనప్పటికీ అభిమానులు మాత్రం కాస్త నిరాశ చెందారు.

ఎవడే సుబ్రమణ్యంతో మళ్లీ ఫామ్‌లోకి...
నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నాని మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారు. ఆ తర్వాత భలే భలే మొగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్‌, మజ్ను, నేను లోకల్‌, నిన్ను కోరి సినిమాలతో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టి రికార్డు సృష్టించాడు. గతేడాది విడుదలైన ఎంసీఏ(మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) సినిమాతో సక్సెన్‌ స్టోరీని కంటిన్యూ చేశారు. అయితే ఈ ఏడాది విడుదలైన కృష్ణార్జున యుద్ధం సినిమా మాత్రం మిశ్రమ ఫలితాన్ని మిగిల్చింది. ప్రస్తుతం రొమాంటిక్‌ కింగ్‌ నాగార్జునతో కలిసి ‘దేవదాస్‌’  అనే భారీ మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్‌ చూస్తుంటే నాని ఖాతాలో మరో హిట్‌ పడుతుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్‌.

బుల్లితెరపై సరికొత్త అవతారంలో..
హీరోగా బిజీగా ఉన్న నాని ఈ ఏడాది.. పాపులర్‌ టీవీ షో బిగ్‌బాస్‌ రెండో సీజన్‌(బిగ్‌బాస్‌) హోస్ట్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. పిట్ట కథతో షోను మొదలు పెడుతూ... వస్తూనే తన మార్క్‌ను చూపించాడు. తనదైన శైలిలో షోను నడిపిస్తూ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడు.

ప్రత్యేక పాత్రల్లో.. నిర్మాతగా..
కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నాని.. పలు తమిళ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కూడా దర్శనమిచ్చాడు. మణిరత్నంలో సినిమాలో నటించాలనుకున్న నానికి ఇప్పటివరకైతే ఆ అవకాశం లభించలేదు కానీ ఓకే కన్మణి (ఓకే బంగారం) సినిమా తెలుగు వర్షన్‌లో హీరోకు డబ్బింగ్‌ చెప్పడం ద్వారా.. ఆయన సినిమాలో భాగమయ్యాడు. అలాగే పలు సినిమాలకు వాయిస్‌ ఓవర్‌ కూడా ఇచ్చారు. కాగా గతంలో ‘డీ ఫర్‌ దోపిడీ’  సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన నాని.. ఈ ఏడాది ‘అ!’  సినిమాతో ప్రశాంత్‌ వర్మ అనే కొత్త దర్శకుడిని టాలీవుడ్‌కి పరిచయం చేశారు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశం‍సలు దక్కించుకుంది.

స్నేహితురాలినే జీవిత భాగస్వామిగా..
తన స్నేహితురాలు అంజనాను ప్రేమించిన నాని.. 2012లో పెద్దల సమక్షంలో ఆమెను వివాహమాడాడు. 2017లో ఈ జంటకు అర్జున్‌ అలియాస్‌ జున్ను జన్మించాడు. ఇలా కెరీర్‌తో పాటు పర్సనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ సంతోషానికి కేరాఫ్‌గా నిలుస్తున్నాడు నాచురల్‌ స్టార్‌. తన నటనా ప్రస్థానానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కొడుకుతో దేవదాస్‌ సెట్లో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన నాని... ‘పదేళ్లు పూర్తయ్యాయి. కానీ ఎప్పుడూ ఎవరి ముందు నటించడానికి ఏమాత్రం బిడియపడలేదంటూ’  ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement