
అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నయనతార ప్రస్తుతం రూ.4 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్న ఏకైక దక్షిణాది కథానాయకిగా రికార్డుకెక్కింది
తమిళసినిమా: మొదట్లో అందాలారబోతకే పరిమితమైన నటి నయనతార. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ నటనలో పరిణతి పొందుతూ స్టార్ హీరోయిన్ అంతస్తును అందుకున్నారు. అంతే అలా అంచెలంచెలుగా నటిగా తన స్థాయిని పెంచుకుంటూ మాయ, అరమ్ వంటి త్రాలతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల కథానాయకి అంతస్తుకు చేరుకుంది. అలా అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నయనతార ప్రస్తుతం రూ.4 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్న ఏకైక దక్షిణాది కథానాయకిగా రికార్డుకెక్కింది.
నయనతార నటించిన తాజా హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం కొలమావు కోకిల (కోకో). అరమ్ వంటి సంచలన చిత్రం తరువాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కావడంతో కోలమావు కోకిల చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. సాధారణంగా రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి స్టార్స్ చిత్రాల విడుదల కోసమే అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తారు.
వారిని దృష్టిలో పెట్టుకునే విడుదల సమయంలో వేకువజామునే చిత్రాలను విడుదల చేస్తుంటారు. ఆ పట్టికలో నటుడు శివకార్తికేయన్ కూడా చేరారు. అదే విధంగా ఇటీవల మిర్చి శివ నటించిన తమిళ్‌పడం–2 చిత్రాన్ని కూడా ఉదయం 6 గంటల ఆటలను ప్రదర్శించారు. నయనతార కూడా స్టార్స్ జతన చేరింది. ఆమె నటించిన కోలమావు కోకిల చిత్రాన్ని శుక్రవారం నగరంలో ఉదయం 6 గంటల ఆటలను ప్రదర్శించారు.
విశేషం ఏమిటంటే ఇవి విద్యార్థులకు సెలవు రోజుల్లో పండగల సమయమో కాదు. అయినా కోకో చిత్రాన్ని ఉదయం ఆటలు ప్రదర్శించడం విశేషమే అవుతుంది. ఇలా హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రాలు ఉదయం ఆటలు పడడం ఇదే ప్రప్రథమం అని చెప్పవచ్చు. ఆ విధంగా నయనతార ఈ చిత్రంతో స్టార్ నటులకు దీటుగా నిలిచిందనే చెప్పాలి.