రానాకి యాక్టింగ్ వస్తుందా.. రాదా?అనే భయం ఉండేది .
– నిర్మాత డి. సురేశ్‌బాబు
‘‘మా వాడు(రానా) హీరో అయ్యాక తనతో నేను తీస్తున్న తొలి చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. మామూలుగా కథలంటే నాకు చాలా భయం. కథ సెలక్ట్ చేయడం కష్టం. నా కొడుకు సినిమాకి కథ అంటే ఇంకా కష్టం’’ అని నిర్మాత డి.సురేశ్‌బాబు అన్నారు. రానా, కాజల్, కేథరిన్, నవదీప్ ముఖ్య పాత్రల్లో తేజ దర్శకత్వంలో డి.రామానాయుడు సమర్పణలో సురేశ్‌బాబు, ఎం.వి. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ ఈ నెల 11న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఇందులో రానా చేసిన జోగేంద్ర పాత్ర పేరుతో ‘జోగేంద్ర యువగర్జన’ అనే కార్యక్రమం నిర్వహించారు. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘తేజ చెప్పిన కథ బాగుందనిపించి వినమని రానాకు చెప్పా. రానాకూ నచ్చింది. నేను తండ్రిని కాబట్టి.. వీడికి యాక్టింగ్ వస్తుందా? రాదా? అనే భయం ఉండేది. తొలి షెడ్యూల్ ఫస్ట్ కాపీ చూసిన కిరణ్‌రెడ్డి ‘అదిరిపోయింది సార్’ అనడంతో ధైర ్యం వచ్చింది’’ అన్నారు. రానా మాట్లాడుతూ– ‘‘వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నేనెప్పుడూ దేవుడిగా చూసే వ్యక్తి ఎన్టీఆర్‌గారు.
ఈ చిత్రంలోని నా పాత్రలో (జోగేంద్ర) ఎన్టీఆర్‌గారి, ఎం.జీ.ఆర్.గారి ఫిలాసఫీ ఉంటాయి. అందుకే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేశా. ఈ చిత్రం మా తాత (రామానాయుడు) చూడలేకపోయారనే లోటు ఉంది. ఈ రోజు ఇక్కడ నిలుచున్నానంటే ఆయనవల్లే. ఆయనతో ఒక్క సినిమా కూడా చేయలేదనే బాధ కూడా ఉంది. మా నాన్న చాలా మంచి నిర్మాత. తేజగారి వద్ద చాలా చాలా నేర్చుకున్నా. మంచి సినిమాలు చేద్దామనే నటుణ్ణి అయ్యా. వెంకటేశ్‌గారి ఫ్యాన్స్ అండగా ఉన్నారనే ధైర్యంతో ముందుకెళుతున్నా.
మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇతర భాషల సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమా అయినా చేస్తా’’ అన్నారు. ‘‘కథ రాయగానే రానాకి కరెక్ట్‌గా సరిపోతుందనుకున్నా. కథ వినగానే రానా, కాజల్ ఓకే అన్నారు’’ అని తేజ చెప్పారు. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి, మాటల రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, లక్ష్మీ భూపాల్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు అభిరామ్ దగ్గుబాటి, వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.