‘1945’లో రానా, ‘డిస్కోరాజా’లో రవితేజ, నభా నటేష్, ‘రెడ్’లో రామ్
దీపావళికి ముందు రోజు ఆ తర్వాత కొత్త లుక్స్ విడుదల సందడి సాగింది. కొత్తగా వచ్చిన ఆ స్టార్స్ చిత్రాల విశేషాల్లోకి వస్తే... ఇప్పటివరకు ఒంటరిగానే దర్శనం ఇచ్చిన రాజా ఈ దీపావళి పండగకి జంటగా కనిపించి ప్రేమ గొడుగు కింద కాస్తంత చోటు దక్కించుకున్నాడు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.‘‘ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ పాట పాడారు. ఈ పాట పూర్తిగా రెట్రో ఫీల్‌ని కలిగిస్తుంది. విడుదల చేసిన పోస్టర్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. డిసెంబరు 20న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
భారతీయ సైనికుడి పాత్రలో రానా నటిస్తున్న చిత్రం ‘1945’. శివకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాజరాజన్ నిర్మాత. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, సినిమాను జనవరి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘సినిమాను పూర్తి చేయడంలో నిర్మాత సఫలం కాలేదు. ఏడాదిగా వారిని నేను కలవలేదు. ఇదొక అసంపూర్ణమైన సినిమా. ఇప్పుడు పోస్టర్‌ను విడుదల చేశారు. మోసం చేసి సంపాదించాలనుకోవడమే వారి ఆలోచన అనుకుంటా’’ అని ఈ చిత్రం గురించి సోషల్ మీడిమాలో రానా పేర్కొన్నారు. ‘‘షూటింగ్ కోసం చాలా ఖర్చు చేశాను. పూర్తి కాని సినిమాను ఎవరూ విడుదల చేయరు. సినిమా పూర్తయిందా? లేదా? అనే విషయాన్ని ఆడియన్స్ నిర్ణయిస్తారు’’ అని నిర్మాత పేర్కొన్నారు.
‘ఇస్మార్ట్ శంకర్’తో మాస్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న రామ్ మరో మాస్ ఫిల్మ్ చేయడానికి రెడీ అయ్యారు. రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘రెడ్’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘స్రవంతి’ రవికిశోర్ ఈ సినిమాను నిర్మిస్తారు. పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు ఫైట్స్ కొరియోగ్రఫీ చేస్తారు. వెండితెర భీష్మగా కనిపించనున్నారు నితిన్. ఆయన హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రంలో రష్మిక మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
‘భీష్మ’లో రష్మిక, నితిన్
Comments
Please login to add a commentAdd a comment