చెన్నై: నటుడు అజిత్ జీవన విధానం ఇతర నటులకు భిన్నంగా అని చెప్పవచ్చు. తనకు సంబంధంలేని ఏ విషయం గురించి అజిత్ స్పందించరు. తనేంటో తన పనేంటో అన్న ఈ విధంగా అతని ప్రవర్తన ఉంటుంది. అందుకే ఆయన ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే అజిత్ నిర్ణయాలు చాలా నిర్ధిష్టంగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన వలిమై చిత్రంలో నటిస్తున్నారు. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయింది.
(చదవండి: కాబోయే భర్త ఎలా ఉండాలంటే?)
అయితే ఈ చిత్రంపై ఇప్పటికే కోలీవుడ్‌లో రకరకాల వదంతులు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాతకు అజిత్‌కు మధ్య విభేదాలు తలెత్తాయని దీంతో చిత్రం డ్రాప్ అయిందనే ప్రచారం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జోరుగా జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని చిత్ర నిర్మాత బోనికపూర్ కొట్టిపారేశారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వలిమై చిత్ర షూటింగ్ మొదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమ మళ్లీ కోలుకోవాలంటే నిర్మాణ ఖర్చులను తగ్గించుకోవాలని, అదేవిధంగా నటీనటులు పారితోషికాన్ని సగానికి తగ్గించుకోవాలి అన్న డిమాండ్ నిర్మాతల నుంచి పెరుగుతోంది. దీంతో కొందరు నటీనటులు, దర్శకులు తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ నటుడు అజిత్ కూడా తన పారితోషకం తగ్గించే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తాజా సమాచారం.
ఆయన ఈ విషయమై చిత్ర నిర్మాత బోనీకపూర్ ఒక మెయిల్‌ను పంపినట్లు తెలిసింది. అందులో చిత్ర విడుదల ఎప్పుడన్నది నిర్ణయించిన తరువాత అప్పటి పరిస్థితులను బట్టి పారితోషికం తగ్గించే విషయమై చర్చిద్దామని చెప్పినట్టు సమాచారం. కాగా నటుడు అజిత్ ప్రస్తుతం ఉన్న స్థాయిలో తన పారితోషికాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని, ఆయన వరుస భారీ అవకాశాలతో బిజీగా ఉన్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా ఆయన తన పారితోషికాన్ని తగ్గించుకునే విషయమై నిర్మాతకు భరోసా ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్తున్నాయి. కాగా అజిత్ పారితోషికం విషయంలో తీసుకున్న నిర్ణయం ఇతర ప్రముఖ నటుల్లో పెద్ద చర్చకే దారితీసిందని సినీ వర్గాలు తెలిపాయి.
(శిరస్సు వంచి నమస్కరించిన అమితాబ్)
Comments
Please login to add a commentAdd a comment