
తమిళ సినిమా: ప్రధానమంత్రి మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైందని నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పేర్కొన్నారు. తూత్తుక్కుడి సంఘటనపై ఈయన స్పందిస్తూ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తూత్తుక్కుడి స్టెర్‌లైట్ పోరాటంలో ప్రజలు దారుణంగా హత్య చేయబడడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానన్నారు. ఈ పోరాటం సమాజం కోసం జరుగుతోందని, ఇది వ్యక్తిగత పోరాటం కాదని అన్నారు.
50వేల మంది కలిసి చేస్తున్న పోరాటం కచ్చితంగా సామాన్య ప్రజల కోసమేనన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పోరాటం ప్రజాస్వామ్యంలో హక్కు అని, అందులో ప్రజలెందుకు పాల్గొనకూడదని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్నది ప్రజల కోసమేనని, మరో దేనికోసం కాదని అన్నారు. ప్రజలు 2019 ఎన్నికల గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా విశాల్ వ్యాఖ్యానించారు. ఇదే విధంగా నటుడు, మక్కల్‌నీది మయ్యం పార్టీ నేత కమలహాసన్ కూడా తూత్తుక్కుడి సంఘటనను తీవ్రంగా ఖండించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.