'అద్భుతం చూడాలంటే వెయిట్ చేయాల్సిందే'
సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనా ఇంత వరకు రాలేదు. షూటింగ్ అప్ డేట్స్ లీక్ చేస్తున్నప్పటికీ.. సినిమా టైటిల్ ఏంటి.. ఫస్ట్ లుక్ ఎప్పుడు.. ఎలా ఉండబోతుంది అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు.
ఇటీవల న్యూ ఇయర్ కానుకగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ వస్తుందని భారీ ప్రచారమే జరిగింది. అంతేకాదు అదే రోజు సినిమా టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తారని భావించారు. అయితే ఇప్పట్లో ఫస్ట్ లుక్ గాని, టైటిల్ గాని ఎనౌన్స్ అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో మరోసారి సూపర్ స్టార్ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ విషయం పై సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రియదర్శి స్పందించాడు.
పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న ప్రియదర్శి.. మహేష్, మురుగదాస్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల మహేష్ అభిమానులతో తన అనుభవాలను పంచుకున్న ఈ యువనటుడు ఫస్ట్ లుక్ ఆలస్యం అవ్వటంపై స్పందించాడు. అద్భుతాన్ని చూడాలంటే కాస్త వెయిట్ చేయాలని.. సూపర్ స్టార్ అభిమానుల కోసం దర్శకుడు అద్భుతమైన విజువల్ వండర్ను సిద్ధం చేస్తున్నాడని తెలిపాడు.