
బాలీవుడ్ - హాలీవుడ్‌లలో ప్రస్తుతం మోస్ట్ రొమాంటిక్ కపుల్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రియానిక్‌దే. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌లు గతేడాది డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే నిక్ కంటే ప్రియాంక పదేళ్లు పెద్దది కావడంతో నెటిజన్లు నేటికీ ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేసినప్పుడల్లా.. నిక్‌కు తల్లిలా ఉన్నావంటూ అభ్యంతరకర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. ఈ విషయం గురించి తొలిసారిగా స్పందించిన పిగ్గీ చాప్స్ మాట్లాడుతూ.. ‘ నా భర్త కంటే నేను పదేళ్లు పెద్దదాన్ని అనే విషయం గురించి కొంతమంది చెత్తగా వాగుతున్నారు. నేటికీ ఇది కొనసాగుతోంది. అయితే ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేస్తూంటుంది. భార్య కంటే భర్త ఎంత పెద్దవాడైనప్పటికీ ఇటువంటి వాళ్లకు అభ్యంతరం ఉండదు. కానీ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి మాత్రం విమర్శలతో సిద్ధమైపోతారు’ అని అసహనం వ్యక్తం చేశారు.
ఇక తనకు, నిక్ జోనస్‌కు ఉన్న సంప్రదాయ వ్యత్యాసాల గురించి ప్రియాంక మాట్లాడుతూ..‘ మొదట బాగానే ఉండేవాళ్లం. కానీ పెళ్లైన తర్వాత చిన్న చిన్న భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఒక్కోసారి తను సర్దుకుపోతాడు. మరోసారి నేను. ఏం జరిగినా మన మంచికే అని చెబుతాడు. అయితే ఇవన్నీ చిన్న విషయాలు. ఇంకోవిషయం.. కొంతమంది చేతులతో మాట్లాడుకుంటారు కదా(సైగలు).. కానీ మేము మాత్రం మనసులతోనే మాట్లాడుకుంటాం. తను నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు’ అని భర్త గురించి చెప్పుకొచ్చారు. కాగా నిక్ ప్రస్తుతం వరుస మ్యూజిక్ కన్సర్ట్‌లతో బిజీగా ఉండగా.. ప్రియాంక ‘స్కై ఈజ్ పింక్’ అనే బాలీవుడ్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.