నితిన్ డైరెక్టర్తో రాజ్ తరుణ్
నితిన్ హీరోగా తెరకెక్కిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో పరిచయం అయిన దర్శకుడు కొండా విజయ్ కుమార్. ఆ తరువాత నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం సినిమాతో యావరేజ్ హిట్ కొట్టిన ఈ యువ దర్శకుడు త్వరలో ఓ యంగ్ హీరో రాజ్ తరుణ్తో సినిమా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇటీవల కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో మరో హిట్ అందుకున్న రాజ్ తరుణ్, అంధగాడు సినిమాతోపాటు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నిర్మిస్తున్న మరో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాను పీవీపీ సంస్థ నిర్మించే అవకాశం ఉంది.