పవన్కు... రాజు రవితేజ దూరమయ్యాడా?
సినీనటుడు పవన్ కళ్యాణ్ అట్టహాసంగా ప్రారంభించిన 'జనసేన' పాల పొంగులాంటిదేనా? తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన విషయంలోనూ అదే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు సంవత్సరం క్రితం జనసేనను ఒక తుఫాను అని అభివర్ణించిన వారే ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం జనసేన కోమాలో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జనసేన అనేది సోదిలో కూడా కనిపించటం లేదు. పవన్ కూడా జనసేనపై ఆసక్తి చూపించటం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అప్పట్లో జనసేన పార్టీ స్థాపించడానికి తన వెనుక డబ్బున్నవారు, రాజకీయ నేతలు లేరనీ చెప్పిన పవన్ కళ్యాణ్... తన స్నేహితుడు రాజు రవితేజ మాత్రమే ఉన్నాడంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు పవన్కు కుడి భుజమైన రాజు రవితేజ ప్రస్తుతం కనిపించటం లేదు. పవన్ తో రాజు రవితేజ పూర్తిగా కట్ ఆఫ్ చేసుకున్నట్లు సమాచారం. పవన్ వ్యవహార శైలి నచ్చకే అతను ...దూరం జరిగినట్లు తెలుస్తోంది. పవన్.. ఊకదంపుడు ఉపన్యాసాలే కానీ.. చేతలు మాత్రం శూన్యమని తెలుసుకున్న రాజు రవితేజ పక్కకు తప్పుకున్నాడని ఓ వర్గం చెబుతోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... పీవీఆర్... పొట్లూరి వరప్రసాద్. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. తాజాగా పీవీఆర్ కూడా పవన్ కళ్యాణ్ను పక్కన పెట్టినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, విశాఖలో జరిగిన జనసేన సభల ఏర్పాటు నిమిత్తం పీవీఆర్...సుమారు మూడు కోట్లు ఖర్చుపెట్టారట. ఇందుకోసం ఆయన..ఎంపీ టిక్కెట్ ఇప్పించే విషయంలో ఒత్తిడి తెచ్చినా చివరికి ఫలితం లేకపోయింది. ఎన్నికల తర్వాత పీవీఆర్ కూడా 'తమ్ముడి' పట్టించుకోవటం లేదట. ఓ వైపు వ్యాపార వ్యవహారాలతో పాటు మరోవైపు సినిమా నిర్మాణాలతో బిజీగా ఉన్నారట.
ఇక పవన్ కూడా తన సినిమాలపై దృష్టి పెట్టాడు. ఓ వైపు మాల్టీ స్టారర్ సినిమా 'గోపాల గోపాల' తో పాటు గబ్బర్ సింగ్-2లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఒకవేళ టీడీపీ, బీజేపీలకు తన సేవలు అవసరం అయితే ...మరోసారి పవన్ తెరమీదకు వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు ప్రతిఫలంగా బీజేపీ... పవన్కు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు సమాచారం.