తగ్గాలి.. పెంచాలి!
రామ్‌చరణ్ కొత్త లుక్ చూశారా! గుబురు గడ్డంతో... కాస్త సన్నబడి కొత్తగా ఉన్నారు కదూ. ‘ధృవ’లో ఆరు పలకల దేహంతో ధృడంగా, క్లీన్ షేవ్‌తో కనిపించారు. ఇప్పుడు గుబురు గడ్డం వెనక ఉన్న స్టోరీ ఏంటని ఆరా తీస్తే, అసలు విషయం తెలిసింది. దర్శకుడు సుకుమార్ వెయిట్ తగ్గి, గడ్డం పెంచమని చరణ్‌ని అడిగారట! ఆయన కోరిక మేరకు రామ్‌చరణ్ గడ్డం పెంచుతున్నారు. బరువు కూడా తగ్గుతున్నారు. తగ్గడం కోసం ఫుడ్ హ్యాబిట్స్‌ని కొంచెం మార్చుకున్నారట. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలోనే చరణ్ ఈ కొత్త లుక్‌లో కనువిందు చేయనున్నారు. ఇంకాస్త గడ్డం పెంచుతారా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఆల్రెడీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దర్శకుడు సుకుమార్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు లొకేషన్లు ఫైనలైజ్ చేశారు. పల్లెటూరి నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ని ఎంపిక చేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త.