
పవర్‌ఫుల్ స్టోరీతో...
రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులు ఫలించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ షురూ అయ్యింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రం నిర్మించనున్నారు. ‘లౌక్యం’, ‘కరెంటు తీగ’.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో కథానాయికగా నటించనున్నారు. మార్చి 5న పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అదే నెల 16న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ- ‘‘ కుటుంబ కథకు యాక్ష న్ అంశాలు జోడించి ఓ పవర్‌ఫుల్ స్టోరీ తయారు చేశాం.
అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ తారాగణంతో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. డీవీవీ దానయ్య మాట్లాడుతూ- ‘‘ఎన్నో భారీ హిట్ చిత్రాలను అందించిన శ్రీనువైట్ల- కోనవెంకట్- గోపీమోహన్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ ఈ చిత్రం రూపొందనుంది. ‘వై దిస్ కొలవరి...’ పాటతో ఎంతో పాపులార్టీ తెచ్చుకున్న అనిరుధ్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం ’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: ఎ.ఆర్.వర్మ, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఫెట్స్: అనల్ అర్స్, సమర్పణ: డి. పార్వతి, మూలకథ- స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.