340 కోట్లతో వర్మ న్యూక్లియర్
కోట్లకు కోట్ల బడ్జెట్‌తోనూ, అవసరమైతే లక్షల బడ్జెట్‌తోనూ సినిమా తీయగల సత్తా ఉన్న నిర్మాతల ఫ్రెండ్లీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తెలుగు ప్రేక్షకులకు తక్కువ బడ్జెట్‌లో ‘ఐస్‌క్రీమ్’ చూపించిన ఆయనే, ఇప్పుడు హిందీలో అమితాబ్ బచ్చన్‌తో ‘సర్కార్-3’ తెరకెక్కిస్తున్నారు. తాజాగా 340 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘న్యూక్లియర్’ అనే ఇంగ్లీష్ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో నటించనున్న ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్స్ రెమ్యునరేషన్ కాకుండా... కేవలం మేకింగ్ బడ్జెట్ మాత్రమే 340 కోట్లు అని చెప్పారాయన.
వర్మకు ఇష్టమైన కాన్సెప్ట్ తీవ్రవాదుల నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఒకవేళ తీవ్రవాదుల చేతికి ‘న్యూక్లియర్’ బాంబ్ చిక్కితే.. కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. అప్పుడు ప్రపంచం అంతం అవుతుందనేది సినిమా కథ. ఇండియా, అమెరికా, రష్యా, చైనా, యెమెన్‌లలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాలో ఆ యా దేశాలకు చెందిన నటీనటులు నటించనున్నారు. వర్మ కంపెనీతో కలసి సి.యం.ఎ. గ్లోబల్ సంస్థ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మించనుంది. వర్మతో 15 సినిమాలకు ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. ‘సర్కార్-3’ పూర్తయిన వెంటనే ‘న్యూక్లియర్’ స్టార్ట్ అవుతుందని వర్మ తెలిపారు.