
వెంకట్, హృశాలి, పావని ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘రాయలసీమ లవ్‌స్టోరీ’. రామ్ రణధీర్ దర్శకత్వంలో నాగరాజు, హుస్సేన్, ఇమ్మాన్యుయేల్ నిర్మిస్తున్న ఈ సినిమా కర్నూల్‌లో ప్రారంభమైంది. నర్వా రాజశేఖర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ క్లాప్ ఇవ్వగా, ఆయన తనయుడు భరత్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
రామ్ రణధీర్ మాట్లాడుతూ– ‘‘రాయలసీమ నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్నో చిత్రాలొచ్చాయి. అవన్నీ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కినవే. మా సినిమా వాటికి భిన్నంగా ఉంటుంది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా రూపొందిస్తున్నాం. కర్నూల్‌లో పది రోజులపాటు మొదటి షెడ్యూల్ ఉంటుంది’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు.