అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే! | sahoo movie director sujeeth interview with sakshi | Sakshi
Sakshi News home page

అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!

Published Fri, Sep 6 2019 12:57 AM | Last Updated on Fri, Sep 6 2019 7:51 AM

sahoo movie director sujeeth interview with sakshi - Sakshi

సుజీత్‌

‘‘దెబ్బలు ఎక్కడ పడ్డాయో తెలుసు, బెటర్‌ చేసుకుంటా. ఓ పది రోజులు బ్రేక్‌ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నా, అది ఎవరో పెట్టిన రచ్చకు మనం ఆలోచిస్తున్నట్టు ఉంటుంది. ఫ్రెష్‌గా మొదలుపెడతాను’’ అన్నారు సుజీత్‌. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ‘సాహో’ ఆగస్ట్‌ 30న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు సుజీత్‌ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు.


► ‘సాహో’ సినిమాకు వస్తున్న స్పందన ఎలా ఉంది?
ప్రస్తుతం బెటర్‌గా ఉంది. ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. కలెక్షన్లు బావున్నందుకు హ్యాపీ. రివ్యూలు కఠినంగా ఉన్నాయనిపించింది. మరీ అంత సెన్సిబులిటీస్‌ లేకుండా తీయను కదా? షార్ట్‌ ఫిల్మ్స్‌ నుంచి వచ్చాను. నా జర్నీ వేరే వాళ్లకు ఆశ కలిగించాలి. నా టీమ్‌ నన్ను బాగా సపోర్ట్‌ చేసింది. ప్రభాస్‌ అన్న, నిర్మాతలు రివ్యూలకు కంగారు పడొద్దని ధైర్యం ఇచ్చారు. రివ్యూ రాసేవాళ్లు సినిమాను సినిమాలా చూడకుండా కొంచెం పర్సనల్‌ అయినట్టు అనిపించింది. బహుశా వాళ్లు ‘బాహుబలి 3’లా ఉంటుందని ఊహించుకొని ఉండొచ్చు.

వాళ్లు ఊహించినట్టు సినిమా లేకుండా ఉండి ఉండొచ్చు. బాలీవుడ్‌ క్రిటిక్‌ తరణ్‌ ఆదర్ష్‌ బాలేదు అన్నట్టు రాశారు.  రెండు రోజుల తర్వాత  ‘ఎక్కువగా ఊహించుకొని వెళ్లడం వల్ల ఎంజాయ్‌ చేయలేదేమో’ అన్నారు. అయితే నాకు కోపం ఏమీ లేదు. హిందీ వాళ్లు ఏ ఉద్దేశంతో తక్కువ రేటింగ్‌ ఇచ్చారో? మన వాళ్లు కూడా అలానే రాశారు కదా (నవ్వుతూ). అది ఆడియన్స్‌ను సినిమాకు వెళ్లకుండా ఆపేస్తుంది. రివ్యూలను ఒకటీ రెండు రోజులు ఆపితే బావుండు అనిపిస్తుంది. రన్నింగ్‌ కామెంట్రీ ఇస్తున్నారు. కొంచెం బాధ అనిపించింది.  

► ‘బాహుబలి’తో ప్రభాస్‌కి వచ్చిన స్టార్‌డమ్‌ వల్ల స్క్రిప్ట్‌లో ఏదైనా మార్పులు చేశారా?
ఏ మార్పులూ చేయలేదు. అయితే యాక్షన్‌లో చేశాం. దాని వల్ల యాక్షన్‌ పెద్దగా అనిపించి కథ లేదనిపించిందేమో? సినిమాలో కథ ఉంది. కథ లేదంటే నేను ఒప్పుకోను. ఒకటి ఎక్కువ డామినేట్‌ చేస్తే మిగతావి చిన్నగా అనిపిస్తాయి. ఉదాహరణకు సినిమాలో పాటల్లాగా. ఒక పాట బావుంటే మిగతావి కిల్‌ అయిపోతుంటాయి.

► 300 కోట్ల సినిమాను డీల్‌ చేయడం ఎలా అనిపిం చింది?
350 కోట్లతో సినిమా చేయాలనే లక్ష్యంతో చేయలేదు. అలానే అనుకుంటే ఆ రోజే చేసేవాళ్లం కాదేమో? రాజమౌళి  గారు ‘బాహుబలి’ని ఒక్క సినిమాలా చేయాలనుకున్నారు. మొదలుపెట్టాక రెండు భాగాలు అయింది. ఎవ్వరైనా సరే పనిలో దిగిన తర్వాతే పెరిగే చాన్స్‌ ఉంటుంది. సినిమా సినిమాకు విధానం మారిపోతుంది. కథకు ఏం కావాలో అది చేస్తుంటాం. బడ్జెట్‌ ఎంతైనా సరే అది స్క్రీన్‌ మీద కనబడాలనుకున్నాం.

► ‘అనుభవం లేని కుర్రాడితో’ సినిమా ఏంటి? అనే కామెంట్స్‌ వినిపించాయి...
అవి నా వరకూ రాలేదు. నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్‌ లేరు. పనైపోగానే ఇంటికి వెళ్లిపోతాను. మళ్లీ ఆఫీస్‌కి వచ్చి పని చేసుకోవడమే. ఆ మధ్య ఫిల్మ్‌ చాంబర్‌కు వెళ్ళినప్పుడు ‘సాహో చాలా పెద్ద సినిమా’ అని మాట్లాడుతుంటే కొంచెం భయమేసింది. రియాలిటీ నిజంగా భయపెడుతుంది. కొన్నిసార్లు మనం అనుకున్నది సాధించాలంటే వాస్తవికతకు దూరంగా ఉండి ప్యాషన్‌తో పని చేస్తుండాలి. ఫీల్డ్‌లో దిగిన తర్వాత ఆలోచనలు ఉండకూడదు.

► బడ్జెట్‌ పెరిగిపోతున్నప్పుడు ఎలా ఫీల్‌ అయ్యారు?
భయం కంటే బాధ్యత ఎక్కువ. బడ్జెట్‌ ఇలా పెరిగింది.. అలా పెరిగింది అని చెబితే వేరేవాళ్లను నిందించినట్టు ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. సినిమా చేయడం కూడా పెళ్లి లాంటిదే. అక్కడ ఆ పూలు ఉంటే బావుంటుంది అనిపిస్తుంది. కొంచెం ఖర్చయినా తెప్పిస్తాం. చూసే వాళ్లందరికీ నచ్చాలి అన్నట్టు చేస్తాం. పెళ్లి వల్ల ఏం వస్తుంది? అయిపోయిన తర్వాత అందరూ వెళ్లిపోతారు. కానీ మన బెస్ట్‌ ఇవ్వాలనుకుంటాం. రిజల్ట్‌ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ప్యాషన్‌తో చేశాం. డబ్బులు వృథాగా ఖర్చు చేశారనేవాళ్లు అంటూనే ఉంటారు.

► ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా సూపర్‌స్టార్‌ అయ్యారు. ఆయన స్టార్‌డమ్‌ కోసం అయినా ‘సాహో’ హిట్‌ అవాల్సిన పరిస్థతి. అదేమైనా ఒత్తిడిగా?
కచ్చితంగా అనిపించింది. ప్రభాస్‌గారి పేరు పెంచకపోయినా ఫర్వాలేదు కానీ తగ్గించకూడదు అనుకున్నాం. ఈ రివ్యూలతోనూ నార్త్‌లో కలెక్షన్స్‌ చూస్తుంటే ప్రభాస్‌ని నార్త్‌లో ఎంత ప్రేమిస్తున్నారో అర్థం అవుతోంది.  

► ‘మళ్లీ ఒక్కసారి చూడండి. నచ్చుతుంది’ అని  ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా పోస్ట్‌ చేశారు..?
ఎమోషనల్‌గా కాకుండా ఫైర్‌ అయిపోదాం అన్నట్టు పోస్ట్‌ చేయాలనుకున్నాను. మళ్లీ ఆగిపోయాను. ‘రెండోసారి చూశాక బాగా నచ్చింది’ అంటూ చాలా మెసేజ్‌లు వచ్చాయి. రెండో సారి చూస్తే అర్థం చేసుకుంటున్నారు అనిపించింది. రెండోసారి చూసి కలెక్షన్లు పెంచేయండి అనే ఉద్దేశంతో అనలేదు. అర్థం కాలేదు అనడం వేరు. అర్థం లేదు అనడం వేరు. అర్థం లేకుండా సన్నివేశాలు రాయలేదు.. తీయలేదు. దేశం మొత్తంగా అందర్నీ మెప్పించే సినిమా తీయడం చాలా కష్టం. ఈ సినిమా ద్వారా పెద్ద స్టార్స్‌తో తీస్తున్నప్పుడు ప్రతీ విషయాన్ని ఒలిచి చెప్పాలని నేర్చుకున్నా. ఇంటెలిజెన్స్‌ని కొంచెం తగ్గించుకొని సినిమాలు చేయాలి.  

► మీ కెరీర్‌కు ‘సాహో’ ప్లస్సా? మైనస్‌ అంటారా?
దర్శకుడిగా ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను. ఒక్క సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నాను. కొత్త టెక్నాలజీలు తెలుసుకున్నాను. నేను ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉన్నాను. ఆడియన్స్‌ చెప్పిన దాన్ని కచ్చితంగా గౌరవిస్తాను.

► ఒక అవకాశం వస్తే ‘సాహో’లో ఏదైనా మారుస్తారా?
లేదు. రిలీజ్‌ అయిన తర్వాత సినిమా మన చేతుల్లో నుంచి ప్రేక్షకులకు వెళ్లిపోయినట్టే. కట్‌ చేసినా, ట్రిమ్‌ చేసినా మనం సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్టే అవుతుంది.

► ‘సాహో’ కథ హాలీవుడ్‌ సినిమా ‘లార్గో వించ్‌’ పాయింట్‌ నుంచి తీసుకున్నారనే కామెంట్స్‌ గురించి?
ఇలా కామెంట్‌ చేసే వాళ్లలో సగం మంది ‘లార్గో వించ్‌’ సినిమా చూసి ఉండరు. చూసే సినిమా కూడా కాదది. ‘ప్రపంచానికి తెలియకుండా కొడుకుని ఓ తండ్రి దాచిపెట్టడం అనే కాన్సెప్ట్‌తో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి’. ఆ సినిమా స్క్రీన్‌ప్లే వేరు. నా సినిమా స్క్రీన్‌ప్లే వేరు. వాళ్లకు నెక్ట్స్‌ సినిమా రిలీజ్‌ వరకూ ఫీడింగ్‌ కావాలి. ప్రస్తుతానికి మేమే ఉన్నాం. ఈ కాంట్రవర్శీ ఇంకా జనాల్లో ఉండాలి. అందుకే రాస్తుంటారు. ఓ పెద్ద హిట్‌ సినిమా నుంచి ప్రేరణ పొందాం అని చెప్పినా  సంతోషపడొచ్చు.

► ఇదంతా మీ మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా?
ఇది రియాలిటీ. ఈ వారం నేను, నెక్ట్స్‌ వారం మరొకరు. జనం మారుతుంటారు. కథ మాత్రం ఇలానే జరుగుతుంటుంది. ఆ కాంట్రవర్శీలు ఇక్కడితో ఆగిపోవాలా, ఇంకా నడుస్తుండాలా అన్నది నా చేతుల్లో ఉంది. దాని గురించి మాట్లాడి ఇంకో నాలుగు రోజులు ఫీడింగ్‌ ఇవ్వదలచుకోలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement