సాయిధరమ్ తేజ్
‘‘ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల నాకు చాన్సులు వస్తున్నాయని నేను నమ్మడం లేదు. కుటుంబ నేపథ్యం వల్ల ఒకటో రెండో వస్తాయి. ఆ తర్వాత పట్టించుకోరు. వరుసగా నా ఆరు సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ నటుడిగా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే నమ్ముతున్నాను. ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై నాకు జడ్జిమెంట్ రాలేదు. అది వస్తే అన్నీ నేర్చుకున్నట్లే. యాక్టర్‌గా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడతాను’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘చిత్రలహరి’. ఇందులో కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించారు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ చెప్పిన విశేషాలు.
► నా స్క్రీన్ నేమ్‌ని సాయితేజ్‌గా మార్చుకోవడం వెనక పెద ్దకారణాలేవీ లేవు. ధరమ్‌ని కొంతకాలం పక్కన పెట్టానంతే. ఈ చిత్రంలో జీవితంలో సక్సెస్ తెలియని విజయ్‌కృష్ణగా నటించాను. ఒకరి జీవితాన్ని ఓ ఐదు పాత్రలు ఎలా ప్రభావితం చేశాయి? అన్నదే కథ. విజయ్ క్యారెక్టర్‌కు బాగా కనెక్ట్ అయ్యాను. కథ విన్నప్పుడే మంచి సినిమా అవుతుంది, వదులుకోకూడదనుకున్నాను.
► పదకొండేళ్లుగా కిషోర్ తిరుమల తెలిసినప్పటికీ సినిమా చేయడం కుదర్లేదు. ఇప్పటికి కుదిరింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంశాలను కిషోర్ బాగా చూపిస్తారు. నా ఆరు సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ నన్ను నమ్మి చాన్స్ ఇచ్చారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. ఇండస్ట్రీలో ఇలాంటి నిర్మాతలు ఉండాలి. దేవి అన్న మ్యూజిక్ చాలా ఇష్టం. ‘దేవి మ్యూజిక్‌లో నువ్వు డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది’ అని మా అమ్మ అనేవారు. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీ. అలాగే సునీల్ అన్నతో వర్క్ చేయడం అనేది నాకున్న కలలో ఒకటి. అది కూడా నెరవేరినందుకు హ్యాపీ.
► నా గత ఆరు సినిమాలు ఆడలేదు. స్క్రిప్ట్‌ను ఎంచుకునే విధానంలో ఇప్పుడు కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పే ధైర్యం వచ్చింది. ఏౖమైనా అంటే.. ‘చూశారు కదండీ.. నా ఆరు సినిమాల రిజల్ట్’ అని చెప్పొచ్చు. కథ పట్ల పూర్తి సంతృప్తిగా ఉంటేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటున్నాను. భవిష్యత్‌లోనూ ఇదే కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రిప్ట్ విని, డౌట్స్ ఉంటే చెబుతా. అంతే కానీ ఈ మార్పు కావాలి. ఫలానా డైలాగ్స్ మార్చాలి. నా బాడీకి ఇది సూట్ అవ్వవు అన్న అభ్యంతరాలు చెప్పను. కానీ సినిమా ఫెయిల్ అయితే అది నా బాధ్యతగా తీసుకుంటాను. ఎందుకంటే హీరోగా నేను ‘యస్’ అన్నప్పుడే సినిమా ముందుకు వెళ్తుంది.
► మాటిచ్చాను కాబట్టి కొన్ని సినిమాలు చేశాను. మాట ఇస్తే ఎలాగైనా నిలబడాలి. స్టార్టింగ్ స్టేజ్‌లో కథ విన్నప్పుడు నచ్చి, ఆ తర్వాత కొంతదూరం ట్రావెల్ చేసిన తర్వాత అది ఎక్కడికో వెళ్లిపోతుందని అనిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ చాయిస్ లేదు. అప్పుడు సినిమా పూర్తి చేయాల్సిందే కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడకపోతే ఆడియన్స్ రెస్పాన్స్, విమర్శకుల అభిప్రాయాలను విశ్లేషించుకుని నన్ను నేను మెరుగుపరచుకోవడానికి మరింత కష్టపడతాను.
► కథలో కంటెంట్ బాగుంటే సక్సెస్ అనేది ఎప్పుడైనా వస్తుంది. ఫెయిల్యుర్ వల్ల ఆగిపోతారనే ఫీలింగ్ ఎప్పుడూ నాకు లేదు. ప్రతి యాక్టర్‌కి ప్రతి శుక్రవారం తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక చాన్స్. దాన్ని నేను నమ్ముతాను. సక్సెస్ ఉన్నప్పుడు మన చుట్టూ గుంపు ఉంటుంది. సక్సెస్ దూరమైనప్పుడు ఇద్దరో ముగ్గురో ఉంటారు. ఈ ఇద్దరు ముగ్గురు మనం ఏ స్టేజ్‌లో ఉన్నా ఉంటారు. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలు చేస్తాను. హిందీ చిత్రం ‘గల్లీభాయ్’ తెలుగు రీమేక్‌లో నేను నటిస్తానన్న వార్తల్లో నిజం లేదు.
► నా బ్రదర్ వైష్ణవ్ తేజ్‌ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై హీరోగా ఇంట్రడ్యూస్ చేయడంలో నా ప్రమేయం లేదు. దర్శకులు బుచ్చిబాబు ప్రొడ్యూసర్స్‌ని కలిసి ముందుకు వెళ్లారు.
హెయిర్ సర్జరీ కోసం, లైపోసక్షన్ కోసమే నేను యూఎస్ ట్రిప్ వెళ్లాననే ప్రచారం జరిగింది. అది నిజం కాదు. ‘విన్నర్’ సినిమా సమయంలో హార్స్‌రైడింగ్ వల్ల బాగా గాయపడ్డాను. ఆ గాయాలను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ‘తేజ్ ఐ లవ్‌యూ’ సినిమా టైమ్‌కి జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తున్న టైమ్‌కి ఆ గాయాలు బాగా ఇబ్బంది పెట్టాయి. యూఎస్‌లోని స్పోర్ట్స్ ఫిజియో దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకుని అక్కడికి వెళ్లాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా ఫిట్‌గా ఉన్నాను.
Comments
Please login to add a commentAdd a comment