
ఆ ముగ్గురితోనూ సమంత
అదృష్టాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అలాంటి అదృష్టం నటి సమంతను పిచ్చ పిచ్చగా వరించేస్తోంది. ఎవరేమన్నా ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లో సమంతనే క్రేజీ హీరోయిన్. ద్విభాషా చిత్రం చేయాలంటే ఇంతకుముందు అనుష్కనో, తమన్ననో, కాజల్ అగర్వాల్‌నో హీరోయిన్‌గా పరిశీలించేవారు. ఇప్పుడు అలాంటి చిత్రాలకు సమంతనే దర్శక నిర్మాతలకు ఠక్కున మైండ్‌లో కొచ్చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో విజయ్, సూర్య, విక్రమ్‌ల సరసన నటిస్తున్న సమంత టాలీవుడ్‌లోనూ మహేశ్‌బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వంటి స్టార్స్‌తో నటిస్తున్నారు.
మలయాళంలో సంచలన విజయం సాధించిన బెంగుళూరు డేస్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో పునర్ నిర్మాణం కానుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యువస్టార్ నాగచైతన్య, సిద్ధార్థ్, ఆర్యల హీరోలుగా నటించనున్నారన్నది తాజా సమాచారం. ఆ ముగ్గురితో కలిసి హీరోయిన్ పాత్రకు లక్కీగర్ల్ సమంత ఎంపిక కానున్నట్లు తెలిసింది. అయితే అధికారికంగా చిత్ర వర్గాలు ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో పీఏపీ సినిమా, దిల్‌రాజ్ వెంకటేశ్వర ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి రానుంది.