
‘‘ఈ లాక్‌డౌన్ సమయంలో నా కుటుంబాన్ని నేను చాలా మిస్ అవుతున్నాను’’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంజయ్ దత్. ఈ విషయంపై సంజయ్ స్పందిస్తూ –‘‘లాక్‌డౌన్ ప్రకటించే సమయానికే నా భార్య (మాన్యతాదత్), పిల్లలు (ఇక్రా, షహ్రాన్) దుబాయ్‌లో ఉండిపోయారు. నా జీవితంలో జరిగిన సంఘటనల వల్ల కొన్ని సందర్భాల్లో నేను నా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చి లాక్‌డౌన్ (జైలు జీవితాన్ని ఉద్దేశించి అయ్యుండొచ్చు) తరహాలాంటి పరిస్థితులను అనుభవించాను. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల కుటుంబానికి మళ్లీ దూరంగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. నా కుటుంబాన్ని నేను చాలా చాలా మిస్ అవుతున్నాను. వాళ్లే నా సర్వస్వం.
అభివృద్ధి చెందిన సాంకేతికతతో వీడియో కాల్ వల్ల వాళ్లను చూడగలుగుతున్నాను . కానీ నా ఫ్యామిలీని కంప్యూటర్‌లో చూడటానికి, నాతో వారు కలిసి ఉండటానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వారు క్షేమంగానే ఉన్నారని నాకు తెలిసినా ఒక భర్తగా, ఒక తండ్రిగా నా కుటుంబం గురించి నాకు ఆందోళన ఉంటుంది. ఈ లాక్‌డౌన్ ముగిసే రోజు కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా కుటుంబం నా ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. జీవితం ఎంత దుర్భరమైనదో ఇలాంటి పరిస్థితులే మనకు నేర్పిస్తాయి. అలాగే మనం ప్రేమించేవారితో మనం గడిపిన మధురమైన సంఘటనలు ఎంత విలువైనవో తెలుస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో తన తర్వాతి చిత్రాల కోసం రీచార్జ్ అవుతున్నట్లు కూడా సంజయ్ దత్ పేర్కొన్నారు.