ఆందోళనగా ఉంది: శ్వేతా బసు | Shweta Basu Prasad Worried About Mental Health During Lockdown | Sakshi
Sakshi News home page

డిప్రెషన్‌లో నటి శ్వేతా బసు..!

Published Tue, Apr 21 2020 1:35 PM | Last Updated on Tue, Apr 21 2020 3:49 PM

Shweta Basu Prasad Worried About Mental Health During Lockdown - Sakshi

లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితం కావడం వల్ల కొందరు మానసిక ఆందోళనకు గురవుతున్నట్టుగా నిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నటి శ్వేతా బసు ప్రసాద్‌ ఇటీవల డిప్రెషన్‌లోని వెళ్లినట్టుగా తెలుస్తోంది. తన మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నట్టు శ్వేతా వెల్లడించారు.ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందుఉన్న వీడియో కాల్ ద్వారా థెరపిస్ట్‌తో మాట్లాడుతూ సలహాలు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. అయితే ప్రతి ఒక్కరు వారి మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధన్యత ఇవ్వాలని శ్వేతా పేర్కొన్నారు. 

‘నా జీవితంలో ఎప్పుడు ఇతరులతో కలిసే ఉన్నాను. తొలుత నా తల్లిదండ్రులు.. ఆ తర్వాత నాకు పెళ్లయింది. ఆ తర్వాత భర్త నుంచి విడపోయాక తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటున్నాను. నేను గతేడాది డిసెంబర్‌లో డిప్రెషన్‌కు లోనుకావడంతో.. ఇందుకు సంబంధించి చికిత్స తీసుకున్నాను. మొత్తం రెండు సెషన్స్‌లో ఇది పూర్తయింది.  నేను బాగానే ఉన్నాను. కానీ ఈ సమయంలో మరోసారి అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే మరోసారి నా థెరపిస్ట్‌తో మాట్లాడాను. వీడియో కాల్‌లో  థెరపిస్ట్‌తో మాట్లాడి సూచనలు తీసుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది ఇలాగే ఇబ్బంది పడతారని నా థెరపిస్ట్‌ నాకు చెప్పారు. నా మానసిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నాను.. కానీ ఈ సమయంలో నా విజ్ఞానాన్ని కోల్పోదలచుకోలేదు.  మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది.. అందుకే ఇలాంటి సమయాల్లో దాని కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నా తల్లిదండ్రులను చాలా మిస్సవుతున్నాను.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో నా తల్లిదండ్రులను చూడటానికి ఓ ప్లాన్‌ చేశాం. నా తల్లి, సోదరుడు నేను ఉంటున్న బిల్డింగ్‌ వద్దకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వారు పైకి రావడానికి వీలుపడలేదు. దీంతో నేను కిందికి వెళ్లి వాళ్లను కలిశాను. ఐదు ఫీట్ల దూరంలో నిల్చుని వారితో 10 నిమిషాల సేపు మాట్లాడాను. కనీసం నా తల్లి హగ్‌ చేసుకోకపోవడం చాలా బాధ అనిపించింది. ఇది చాలా కష్ట సమయం.. త్వరలోనే ఇది వెళ్లిపోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. అయితే ఇతర పనులు మీద దృష్టి సారించడం ద్వారా దీని నుంచి బయటపడేందుకు కృషి చేస్తున్నట్టు’ శ్వేతా చెప్పారు. 

కాగా, తెలుగులో తొలి సినిమాతోనే సంచలనం సృష్టించారు నటి శ్వేతా  బసు ప్రసాద్‌. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. అవి మంచి ఫలితాలు ఇవ్వలేదు. ఇదే సమయంలో శ్వేతాను పలు వివాదాలు కూడా చుట్టూ ముట్టాయి. దీంతో ఆమె అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2018 డిసెంబర్‌ 13న ఆమె బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైయినా ఏడాదికే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement