‘నమ్మవీట్టు పిళ్లై’ రిలీజ్ ఎప్పుడంటే! | Siva Karthikeyan's New Movie Release Date Announced | Sakshi
Sakshi News home page

‘నమ్మవీట్టు పిళ్లై’ రిలీజ్ ఎప్పుడంటే!

Published Sat, Sep 21 2019 8:04 AM | Last Updated on Sat, Sep 21 2019 8:04 AM

Siva Karthikeyan's New Movie Release Date Announced - Sakshi

నటుడు శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం నమ్మవీట్టుపిళ్లై. ఆయనకు జంటగా అనుఇమ్మాన్యువేల్‌ నటించింది. ఈ బ్యూటీ చాలా గ్యాప్‌ తరువాత కోలీవుడ్‌లో నటించిన చిత్రం ఇది. ఇకపోతే ఇందులో మరో నటి ఐశ్వర్యరాజేశ్‌ శివకార్తికేయన్‌కు చెల్లెలిగా ముఖ్య పాత్రలో నటించింది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పాండిరాజ్‌ తెరకెక్కించిన మరో గ్రామీణ కథా చిత్రం నమ్మవీట్టుపిళ్లై. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు భారతీరాజా, సముద్రకని ప్రధాన పాత్రల్లో నటించారు. వారితో పాటు నట్టి, ఆర్‌కే.సురేశ్, సూరి, యోగిబాబు, వేలరామమూర్తి, నాడోడిగళ్‌ గోపాల్, సుబ్బుపంజు, అర్చన, షీలా, సంతానలక్ష్మి ముఖ్యపాత్రల్లో నటించారు.

కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఇటీవల విడుదలై మంచి స్పందనను తెచ్చుకున్నాయి. దీనికి నీరవ్‌షా ఛాయాగ్రహణం అందించారు. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్‌ పొందింది. కాగా నమ్మవీట్టుపిళ్లై చిత్రాన్ని ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం శుక్రవారం అధికారపూర్వకంగా ప్రకటించారు.

ఈ చిత్రంపై నటుడు శివకార్తికేయన్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన చిత్రాలు వరుసగా నిరాశపరచడమే ఇందుకు కారణం. అదీ కాకుండా శివకార్తికేయన్‌ తొలి రోజుల్లో పాండిరాజ్‌ దర్శకత్వంలో మెరినా, కేడీబిల్లా కిల్లాడిరంగా చిత్రాల్లో నటించారు. అవి మంచి సక్సెస్‌ అయ్యాయి. తాజాగా నటించిన నమ్మవీట్టుపిళ్లై వీరి కాంబినేషన్‌లో రూపొందిన మూడవ చిత్రం అవుతుంది. ఈ చిత్రంతో హ్యాట్రిక్‌ కొట్టాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం శివకార్తికేయన్‌ హీరో చిత్రంలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement