
‘బ్యాచిలర్స్, మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, అదిరిందయ్యా చంద్రం’ వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు శివాజీ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఒకప్పుడు వరుస చిత్రాలు చేసిన ఆయన 2014లో వచ్చిన ‘బూచమ్మ బూచోడు’ తర్వాత వెండితెరకు దూరమై, రాజకీయాల వైపు అడుగులు వేశారు. అయితే శివాజీ తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కావడం విశేషం.
అభిషేక్ బచ్చన్ హీరోగా ప్రియాంక చోప్రా, దీపికా పదుకోన్ హీరోయిన్లుగా నూతన దర్శకుడు ఆసిఫ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ముంబైలో వాస్తవంగా జరిగిన గ్యాంగ్ వార్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నెగటివ్ టచ్ ఉన్న పోలీస్ అధికారి పాత్రలో శివాజీ కనిపించబోతున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. శివాజీ తెలుగు తెరపై కనిపించడంలో లేటైనా లేటెస్ట్‌గా బాలీవుడ్‌లో అడుగుపెడుతుండటం విశేషమే. చిత్రబృందం ఇప్పటికే శివాజీతో కథా చర్చలు జరిపారు. జస్ట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం.