థియేటర్లో టపాసులు కాల్చి గందరగోళం
అభిమానానికి కూడా హద్దులు ఉండాలి. అది హద్దు మీరితే ప్రమోదం కాస్తా ప్రమాదంగా మారుతుంది. షారుక్ ఖాన్ అభిమానులు సరిగ్గా ఇలాగే అతి చేశారు. రణబీర్ కపూర్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఒక సన్నివేశంలో బాలీవుడ్ బాద్షా షారుక్ అతిథి పాత్ర పోషించారు. సినిమాలో ఆయనను చూడగానే అభిమానులకు ఒక్కసారిగా పూనకం వచ్చినట్లయింది. ఏకంగా థియేటర్‌లోనే పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. మహారాష్ట్రలోని మాలెగావ్‌లో గల ఒక థియేటర్‌లో ఈ ఘటన జరిగింది.
హాలు మొత్తం ఒక్కసారిగా టపాసుల మోతలతో దద్దరిల్లింది. ఏం జరుగుతోందో థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులకు తెలిసేలోపే మంటలు, పొగ అంతా వ్యాపించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వాట్సప్ ద్వారా చేరడంతో షారుక్ అభిమాని ఒకరు దాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాంతో నువ్వే షూట్ చేశావా అంటూ ట్విట్టర్ జనాలు అతడి మీద మండిపడ్డారు. కానీ.. చివరకు అది షూట్ చేసింది తాను కాదని, ఎవరో వాట్సప్‌లో పంపారని అతడు సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తమ్మీద కొంతమంది అభిమానులు చేసిన అతి కారణంగా సినిమాకు వచ్చిన ప్రేక్షకులంతా నానా ఇబ్బందుల పాలు కావాల్సి వచ్చిందన్నమాట.