చెన్నై : రజనీకాంత్ ఈ పేరు సినీ అభిమానులకు తారక మంత్రం. ఎందరికో ఉత్సాహాన్ని, మరెందరికో ప్రోత్సాహాన్ని, అందరికీ స్ఫూర్తిని ఇచ్చే పేరు రజనీకాంత్. చాలా మంది కలలు కనే సూపర్‌స్టార్. పోలిటికల్ స్టార్‌గా మరెందరో కలలు కంటున్న నటుడు. అన్నీ కలిసొస్తే రేపటి తమిళం నాయకుడు. అతడే రజనీకాంత్. కష్టాలు పడిన వ్యక్తి. కన్నీటి విలువ తెలిసిన మనిషి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి నిలువెత్తు అద్దం. ఆడంబరాలను చూసిన వ్యక్తి, అయినా నిరాడంబరమే ఈయన పాటించే సూక్తి. గొప్ప గుప్తదానపరుడు రజనీ. సేవా కార్యక్రమాలకు ప్రోద్బలుడు రజనీ. ఈయన స్టైల్స్‌కు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అదే చిటికేస్తే అభిమానుల దండు సామాజిక సేవలకు ఉరుకుతుంది. ఇలా రజనీకాంత్ సులక్షణాలను ఏకరువు పెట్టడానికి ఎంతో ఉంది. అందరూ పుడతారు. కొందరే దానికి సార్థకతను చేకూర్చుకుంటారు. అలా సార్థక నామధేయుడు రజనీకాంత్. ఈయన జీవితం అందరికీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ రోజు ఈ తలైవా పుట్టిన రోజు.. ఓ సారి ఆయన ప్రస్థానం వైపు కన్నేద్ధాం...
పేదరికమే పుట్టినిల్లుగా ...
రజనీకాంత్ అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్ అన్నది ఏ కాస్త సినీ పరిజ్ఞానం ఉన్న వారందరికీ విధితమే. కర్ణాటక రాష్ట్రం, బెంగళూర్‌లో పుట్టి పెరిగిన మరాఠీ కుటుంబీకుడు. రామోజీరావ్ గైక్వాడ్, రమాబాయిలకు పుట్టిన నాలుగవ సంతానం. 1949 డిసెంబర్ 12న పుట్టిన శివాజీరావ్ గైక్వాడ్ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి సాధారణ బాల్యానే అనుభవించాడు. బెంగళూర్‌లోని ఆచార్య పాఠశాల, వివేకానంద బాలక్ సంఘం పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. చిన్నతనం నుంచే భయం అనేది ఆయకు చాలా దూరం, అదే సమయంలో ధైర్యం ఎక్కువ. అయితే శివాజీరావ్‌కు చదువుపై కంటే నటనపైనే ఆసక్తి, మక్కువ. అలా పాఠశాల విద్య పూర్తి కాగానే నాటకాల్లో నటించడం ప్రారంభిచాడు. అలా భృతి కోసం బస్ కండక్టర్‌గా వృత్తిని చేపట్టారు. అయితే నటనపై ఆసక్తి వెంటాడుతుంటే ఆర్థిక స్తోమత లేకపోయినా, మిత్రుల సాయంతో మదరాసు పట్టణానికి రైలెక్కేశాడు. ఆ తరువాత నటనలో శిక్షణ కోసం ఫిల్మ్‌ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. ఆ సమయంలో పడరాని కష్టాలు పడ్డాడు. అయినా మొండి ధైర్యం, ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధనపై దృష్టి పెట్టారు.
కష్టే ఫలి అంటారు కదా..అలా దర్శకుడు కే.బాలచందర్ దృష్టిలో పడ్డాడు. 1975లో ఆయన దర్శకత్వం వహించిన అపూర్వరాగంగళ్ చిత్రంలో చిన్న పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అలా కే.బాలచందర్ చేత నటుడిగానే కాకుండా రజనీకాంత్‌గానే రూపాంతరం చెందారు. మలి చిత్రాన్ని కన్నడంలో చేశారు. ఆ తరువాత అదే కే.బాలచందర్ మూండ్రు ముడిచ్చు అనే చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు రజనీకాంత్‌లోని విలక్షణ నటనకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లకు చాలా పవర్ ఉంటుంది. మనిíÙలో మరుగున పడిన కసి అనే పక్షికి రెక్కలు విప్పుకునేలా చేస్తాయి. అలా నటన అదే దాహంలో ఉన్న రజనీకాంత్‌కు దాన్ని తీర్చే అవకాశాలు రావడం, ఆయనలోని నటనకు పదును పెట్టడంతో స్టార్ హీరోగా అవతరించారు. తనదైన స్టైలిష్ నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా ఈయన సిగరెట్ తాగడంలో స్టైలే వేరు. ఆ స్టైల్‌కే సినీ జనాలు ఫిదా అయిపోయారు. 16 వయదినిలే, గాయత్రీ చిత్రాల్లో విలన్‌గా నటించి పేరు తెచ్చుకున్నారు.1977లో నటించిన భువన ఒరు కేల్వికురి చిత్రం రజనీకాంత్ కెరీర్‌కు పెద్ద టర్నింగ్ అయ్యింది.
ప్రతినాయకుడిగా చప్పట్లు కొట్టించుకున్న రజనీకాంత్‌లో కథానాయకుడుగా ఉన్నాడని గుర్తించిన రచయిత, నిర్మాత కలైజ్ఞానం భైరవి అనే చిత్రంతో రజనీ సినీ జీవితాన్ని మరో మలుపు తిప్పారు. అలా కథానాయకుడిగా తొలి చిత్రంతోనే సూపర్‌స్టార్ పట్టంను కట్టించుకున్న అరుదైన నటుడు రజనీకాంత్. ముల్లుం మలరుం, ఆరిలిరిందు అరుబదు వరై వంటి చిత్రాలు రజనీకాంత్‌లోని నటుడిని మరింద పదునుపెట్టాయి. ఆ తరువాత బిల్లా, పోకిరిరాజా, తన్నికాట్టు రాజా, మురట్టు కాళై వంటి పక్కా కమర్శియల్ చిత్రాలు రజనీకాంత్‌ను ఉన్నత స్థానంలో కూర్చొపెట్టాయి. అదేవిధంగా పడిక్కాదన్, మన్నన్, అన్నామలై, పాండియన్, మూండ్రుముగం, బాషా, చంద్రముఖి, ముత్తు, శివాజీ, యందిరన్ ఇలా వరుసగా పలు చిత్రాలు రజనీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచాయి. ముత్తు చిత్రంతో ఈయన ఖ్యాతి ఖండాంతరం దాటింది. జపాన్, మలాలీ భాషల్లో అనువదింప బడి వసూళ్ల వర్షం కురిపించిన చిత్రం ముత్తు. ఇక బాషా చిత్రంలో డాన్‌గా విశ్వరూపం చూపించారు. ఈ చిత్రంతో తెలుగులోనూ కలెక్షన్ల కింగ్‌గా మారారు.
రజనీకాంత్ ఒక్క తమిళంలోనే కాదు, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్, బెంగాళీ అంటూ భాషల్లో నటించి తనదైన ముద్రను వేసుకున్నారు. తమిళ సినీరంగాన్ని ఎంజీఆర్, శివాజీగణేశన్ వంటి దిగ్గజాలు ఏలుతున్న సమయంలోనే రజనీకాంత్ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇలా రజనీకాంత్ జీవిత పయనం ఎందరికో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక పాఠం అని చెప్పవచ్చు. 40 ఏళ్లుగా సూపర్‌స్టార్, దక్షిణాది సూపర్‌స్టార్, ఇండియన్ సూపర్‌స్టార్‌గా ఏక ఛత్రాదిపత్యాన్ని ఏలుతున్న రజనీకాంత్ తన 69 ఏళ్ల వయసులోనూ ఇటీవల పేట అనే చిత్రంలో రజనీ శభాష్ అనిపించారు. గురువారం ఈ సంచలన నటుడి జన్మదినం. రజనీకాంత్ 70వ ఏటలోకి అడుగు పెట్టారు. ఆయన వయసు మాత్రమే జస్ట్ ఒక్క ఏడాదే పెరిగింది. ఆయన వేగం, స్టైల్, క్రేజ్, స్టార్‌డమ్ ఇత్యాదివన్నీ గత 40 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పటికీ యాజ్ ఇటీజ్‌నే. ప్రస్తుతం దర్బార్ చిత్రంలో పొంగల్‌కు దుమ్మురేపడానికి సిద్ధం అవుతుండడంతో పాటు, 70లోనూ తన చావ, సత్తా చూపడానికి 168వ చిత్రంలో నటించడానికి రెడీ అయిపోయారు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో నిరాడంబరంగా ప్రారంభమైంది. ఇందులో సీనియర్ నటీమణులు కుష్బూ, మీనాలతో పాటు ఈ తరం క్రేజీ నటి కీర్తీసురేశ్ నటిస్తున్నారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని సమాచారం.
నవశకానికి వ్యూహంలో రజనీ
సినీరంగంలో తిరుగులేని నాయకుడిగా రాణిస్తున్న రజనీకాంత్‌ను ఆయన అభిమానులు ఇప్పటికే తలైవా(నాయకుడు) అని సం¿ోదిస్తున్నారు. అయితే వారి ఆకాంక్ష అంతా రజనీకాంత్‌ను రాజకీయ తలైవాగా చూడాలన్నదే. కాగా వారి చిరకాల కోరికను తీర్చడానికి రజనీకాంత్ కూడా సిద్ధం అయ్యారు. ఇప్పటికే తన రాజకీయ రంగప్రవేశం తథ్యం అని భహిరంగంగానే ప్రకటించిన రజనీకాంత్ ఇక పార్టీని ప్రకటించడమే తరువాయి అన్నంతగా రాజకీయ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. గత 25 ఏళ్ల అభిమానుల కలను సాకారం చేయడానికి పావులు కదుపుతున్నారు. సమయం దగ్గర పడుతోంది. సుమారు మరో ఏడాదిన్నర మాత్రమే ఉంది. రాజకీయ రణరంగంలోకి దూకడానికి శస్త్ర హస్తాలు సిద్ధంచేసుకుంటున్నారన్నది ఆయన ప్రజాసంఘ నిర్వాహకుల మాట. ఇప్పటికే తన అభిమానులను ప్రజా క్షేత్రంలోకి దింపిన రజనీకాంత్ త్వరలోనే తనూ ప్రజల్లోకి వెళ్లడానికి వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సహా నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌తో రాజకీయ దోస్తీకి సై అంటున్నారు. సినీరంగంలోని తమ స్నేహం రాజకీయరంగంలోనూ కొనసాగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సూచనగా రాబోయే కాలంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు అని రజనీకాంత్ బహిరంగంగానే పేర్కొన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఇటీవల దర్బార్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై అభిమానుల నమ్మకాన్ని వృతాకానీయనని చెప్పి వారిలో ఆశలను మరింత చిగురింపజేశారు. దీంతో తమిళనాడు రాజకీయాల వాతావరణం వేడెక్కింది. మరి ఈ సినీ రారాజా, రాజకీయ రాజు అవుతారా చూద్దాం. 70వ ఏటలో అడుగుపెడుతున్న మన సూపర్‌స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుదామా!
Comments
Please login to add a commentAdd a comment