
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిభ, బంధుప్రీతి వంటి అంశాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ఇండస్ట్రీ సుశాంత్‌ను పట్టించుకోలేదని.. అతడిని నిర్లక్ష్యం చేసిందని.. ఆ బాధ తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ ఆప్త మిత్రురాలు రోహిణి అయ్యర్ చేసిన సోషల్ మీడయా పోస్టింగ్ తెగ వైరలవుతోంది. సుశాంత్ మరణాన్ని కొందరు తమ ఎజెండాగా మార్చుకుని.. ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. సుశాంత్ మరణాన్ని ఇలాంటి పోస్టింగులతో తక్కువ చేయవద్దని కోరారు. తన స్నేహితుడు డబ్బు, కీర్తి గురించి పట్టించుకోలేదని.. స్టార్స్‌తో గడపాలని కోరుకోలేదన్నారు. తనకు ఎలాంటి క్యాంప్‌లు అవసరం లేదని.. తన సొంత రాజ్యం తనకు ఉందని ఆమె తెలిపారు.
‘మీ అభిప్రాయాలతో, మీ గుర్తింపుతో అతడికి పని లేదు. తనతో కాంటాక్ట్‌లో లేకున్నా అతడి గురించి పోస్టింగులు చేసినా ఎప్పడు పట్టించుకోలేదు. నకిలీ స్నేహితులు, ఫోన్ కాల్స్‌ను అతడు అసహ్యించుకునేవాడు. మీ పార్టీలను అతడు తిరస్కరించేవాడు. అతనెప్పుడు బయటివాడే.. మీలో ఒకడు కావాలని అతను ఎప్పుడు ఆశించలేదు. 100 కోట్ల క్లబ్బు గురించి అతడు పట్టించుకోలేదు. ఎలాంటి కేటగిరిల గురించి అతడికి పట్టింపు లేదు. అవార్డ్ ఫంక్షన్‌లంటే అతడికి విసుగు. తనను ఉత్తమ నటుడిగా ప్రకటించే లోపే బోర్ కొట్టి ఓ ఫంక్షన్ నుంచి బయటకు వెళ్లాడు. సినిమాలు కాకుండా అతడికి చాలా ఆసక్తులు ఉన్నాయి. ఆస్ట్రానమీ, సైన్స్ అంటే తనకు చాలా ఇష్టం. తను చారిటీల్లో, సైన్స్ ప్రాజెక్ట్స్‌లో, కొత్త ఆవిష్కరణల్లో పెట్టుబడి పెట్టాడు. దయచేసి అతడిని అర్థం చేసుకోవాడనికి ప్రయత్నించకండి. మీ ఎంజెడా కోసం అతడి ప్రతిభను తగ్గించకండి’ అని కోరారు. (సుశాంత్ మామూ బతికే ఉన్నాడు!)
అంతేకాక ‘కోట్ల విలువైన చెక్కులను అతను తిరిగి ఇవ్వడం నేను చూశాను. అతని వరకు పనిలో నాణ్యత చాలా ముఖ్యం. ఫోన్ ఆఫ్ చేసి చేపలు పట్టడానికి, వ్యవసాయం చేయడానికి కూడా వెళ్లేవాడు. అన్ని నియమాలను అతిక్రమించగల తెగువ అతని సొంతం. తనో వజ్రం, ప్లాస్టిక్‌ను మాత్రమే ఉపయోగించే పరిశ్రమ ఆ వజ్రాన్ని గుర్తించలేదు. మీరు కూడా అతడిని గుర్తించలేదు.. ఎందుకంటే మీరూ ప్లాస్టిక్‌నే వాడతారు. కనుక నేను కోరిది ఒక్కటే. ప్రతి ఒక్కరు వాస్తవంగా అతడు ఏంటో గుర్తించుకోవాలని కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీ అభిప్రాయాలను అతడు అస్సలు పట్టించుకోడు. నా వరకు అతడి వారసత్వాన్ని కాపాడటం చాలా ముఖ్యం. మరోసారి రికార్డులను సరి చూసుకోండి’ అని రాసుకొచ్చారు రోహిణి అయ్యర్.(సుశాంత్ చావును అవమానిస్తున్నారు: హీరో)