
శత్రువు ఆట.. ధృవ వేట
మంచి అనే ముసుగులో ఓ శాస్త్రవేత్త మోసం చేస్తుంటాడు. అతడి చీకటి సామ్రాజ్యానికి ఐపీయస్ ట్రైనింగ్‌లో ఉన్న ధృవ చెక్ పెట్టాలనుకుంటాడు. ఇది తెలిసిన శాస్త్రవేత్త ధృవ అడుగులకు అడ్డు తగులుతూ ఓ ఆట ఆడాలనుకుంటాడు. తన కంటే బలవంతుడైన శత్రువుకి అసలు విషయం తెలిసిన తర్వాత కూడా, అతడి ఆటకు ధీటుగా ధృవ వేటాడిన తీరు చూడాలంటే డిసెంబర్ వరకూ వెయిట్ చేయక తప్పదు. రామ్‌చరణ్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘ధృవ’. త్వరలో పాటల్ని, డిసెంబర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ధృవగా రామ్‌చరణ్, శాస్త్రవేత్తగా అరవింద్ స్వామి నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ‘‘నవంబర్ తొలి వారంలో హీరో పరిచయ గీతం చిత్రీకరిస్తాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారీ నిర్మాణ వ్యయం, ఉన్నత సాంకేతిక విలువలతో చిత్రం రూపొందుతోంది’’ అని చిత్ర బృందం తెలిపింది. నాజర్, పోసాని నటించిన ఈ చిత్రానికి కెమేరా: పి.యస్.వినోద్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై.ప్రవీణ్ కుమార్, సంగీతం: హిప్ హాప్ తమిళ (ఆది).