విదేశాల్లోనూ ‘అడ్డా’ - సుశాంత్
విదేశాల్లోనూ ‘అడ్డా’ - సుశాంత్
Published Thu, Aug 15 2013 1:14 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
‘‘నా గత రెండు చిత్రాలకన్నా ‘అడ్డా’లో కొత్త లుక్‌లో కనిపిస్తాను. నటుడిగా నిరూపించుకోవడానికి ఆస్కారం ఉన్న పాత్ర నాది. అన్ని వర్గాలవారు చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు సుశాంత్. జి.సాయికార్తీక్ దర్శకత్వంలో శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అడ్డా’. సుశాంత్, శాన్వి జంటగా నటించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ - ‘‘రెండేళ్ల విరామం తర్వాత నా సినిమా విడుదలవుతోంది. ఈ రెండేళ్లల్లో ఎన్నో కథలు విన్నాను. కానీ ఈ చిత్రకథ బాగా నచ్చింది. విజయవంతమైన సినిమాకి కావల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ముందుగా ఈ చిత్రకథను చింతలపూడి శ్రీనివాసరావుగారికి కార్తీక్ చెప్పారు. చాలా బాగుందని చెప్పడంతో విని, నేనూ ఎగ్జయిట్ అయ్యాను. పూరీ జగన్నాథ్‌గారి శిష్యుడు కార్తీక్. అందుకని పూరీ తరహా పంచ్ డైలాగులు ఇందులో ఉంటాయి.
ఈ సినిమా పరంగా ఆనందించదగ్గ విషయం ఏంటంటే.. విదేశాల్లో కూడా విడుదలవుతోంది. విదేశాల్లో విడుదలవుతున్న నా తొలి సినిమా ఇది. లవ్, యాక్షన్, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలు సమపాళ్లల్లో కుదిరిన కథ. ఇలాంటి మంచి సినిమా చేయడానికి ఎన్నేళ్లయినా గ్యాప్ తీసుకోవచ్చు. ఎంత మంచి సినిమా తీసినా సరైన ప్రచారం లేకపోతే ప్రేక్షకులకు రీచ్ కాలేదు. అందుకే ప్రచార గీతాన్ని ఐపీఎల్ మ్యాచ్‌లో విడుదల చేశాం. టైటిల్, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా విజయం మీద నాకు చాలా నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
Advertisement
Advertisement